శుబ్‌మన్‌ మరో బ్యాటింగ్‌ రికార్డు

8 Jan, 2021 12:44 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌(50;101 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, గిల్‌లు ఆరంభించారు. వీరిద్దరూ టీమిండియాకు చక్కటి ప్రారంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 70 పరుగులు సాధించిన తర్వాత రోహిత్‌(26;77 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌)  తొలి వికెట్‌గా ఔటయ్యాడు. హజిల్‌వుడ్‌ వేసిన 27 ఓవర్‌ ఆఖరి బంతికి రిటర్న్‌ క్యాచ్‌ పెవిలియన్‌ చేరాడు. అనంతరం చతేశ్వర పుజారాతో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. కాగా, గిల్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. లయన్‌ వేసిన 32 ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీయడం ద్వారా హాఫ్‌ సెంచరీ సాధించిన గిల్‌.. కమిన్స్‌ వేసిన 33 ఓవర్‌ తొలి బంతికి పెవిలియన్‌ చేరాడు. అయితే గిల్‌ అరుదైన రికార్డును లిఖించాడు. (జడేజా బంతితో చెలరేగినా.. స్మిత్‌ సెంచరీ కొట్టేశాడు)

ఆసియా ఉపఖండం బయట పిన్నవయసులో యాభై, అంతకంటే అత్యధిక పరుగులు చేసిన నాల్గో టీమిండియా ఓపెనర్‌గా గిల్‌ నిలిచాడు. గిల్‌ 21 ఏళ్ల 122 రోజుల వయసులో గిల్‌ అర్థ శతకం సాధించాడు. అది ఆస్ట్రేలియాలో కావడం విశేషం. దాంతో రవిశాస్త్రి(20 ఏళ్ల, 44 రోజులు-ఇంగ్లండ్‌పై), మాధవ్‌ ఆప్టే(20 ఏళ్ల 108 రోజులు-వెస్టిండీస్‌పై), పృథ్వీ  షా(20 ఏళ్ల 111 రోజులు-న్యూజిలాండ్‌పై)ల తర్వాత స్థానాన్ని గిల్‌ ఆక్రమించాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో గిల్‌ ఒక రికార్డును సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో గిల్‌ 45 పరుగులు సాధించాడు. తద్వారా ఆస్ట్రేలియాలో అరంగేట్రం  టెస్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన మూడో టీమిండియా క్రికెటర్‌గా గిల్‌ రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. 

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 338 పరుగులకు ఆలౌటైంది. 166/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌  ఆరంభించిన ఆసీస్‌ మరో 172 పరుగులు చేసి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాళ్లు లబూషేన్‌ (91; 196 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ కోల్పోగా,  స్టీవ్‌ స్మిత్‌(131; 226 బంతుల్లో 16 ఫోర్లు) శతకం సాధించాడు. స్మిత్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండి స్కోరును చక్కదిద్దాడు. ఈ రోజు ఆటలో టీమిండియా బౌలింగ్‌లో రాణించినా స్మిత్‌ మాత్రం శతకంతో ఆకట్టుకోవడంతో ఆసీస్‌ తేరుకుంది.  ఇక మిగతా ఆటగాళ్లలో మిచెల్‌ స్టార్క్‌(24) బ్యాట్‌ ఝుళిపించాడు. తొలి రోజు ఆటలో విల్‌ పకోవ్‌స్కీ (62; 4 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. (సెంచరీలు సమం చేసి.. పరుగుల్లో దాటేశాడు!)

మరిన్ని వార్తలు