IND VS NZ 1st ODI: సెంచరీతో కోహ్లి, ధవన్‌ రికార్డు బద్దలు కొట్టిన గిల్‌

18 Jan, 2023 16:11 IST|Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ వరుస శతకాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల (జనవరి 15) శ్రీలం‍కపై మూడో వన్డేలో (97 బంతుల్లో 116; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించిన గిల్‌.. ఇవాళ (జనవరి 18) న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనూ శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో 87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన గిల్‌.. వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించడంతో పాటు అతి తక్కువ వన్డేల్లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్‌ ధవన్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు.

ధవన్‌.. 17 వన్డేల్లో 3 సెంచరీలు పూర్తి చేయగా.. గిల్‌.. 19 వన్డేల్లో ఈ మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డుతో పాటు గిల్‌ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో పాక్‌ ఆటగాడు ఫకర్‌ జమాన్‌ (18 వన్డేలు) అగ్రస్థానంలో ఉండగా.. గిల్‌, మరో పాక్‌ ఆటగాడు ఇమామ్‌ ఉల్‌ హాక్‌తో కలిసి రెండో స్థానం‍లో నిలిచాడు. భారత్‌ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో గిల్‌ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధవన్‌ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ 210/4గా ఉంది. గిల్‌ (94 బంతుల్లో 111; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్‌ పాండ్యా (22 బంతుల్లో 11; ఫోర్‌) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్‌ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్‌ (31) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్‌ కోహ్లి (8), ఇషాన్‌ కిషన్‌ (5) నిరుత్సాహపరిచారు. కివీస్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌, టిక్నర్‌, సాంట్నర్‌, డారిల్‌ మిచెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

మరిన్ని వార్తలు