100 బాల్స్‌.. 102 రన్స్‌.. నో సిక్సర్స్‌

24 Oct, 2020 22:03 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత దారుణంగా విఫలమైన బ్యాట్స్‌మెన్‌లలో కింగ్స్‌ పంజాబ్‌ క్రికెటర్‌ మ్యాక్స్‌వెల్‌ ఒకడు. గతంలో ఎప్పుడూ చూడని మ్యాక్స్‌వెల్‌ను ప్రస్తుత ఐపీఎల్‌ చూస్తున్నామనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడూ తన విధ్వంసకర ఆట తీరుతో  ప్రత్యర్థులకు దడ పుట్టించే మ్యాక్స్‌వెల్‌ ఈ సీజన్‌ ఐపీఎల్‌లో పూర్తిగా తేలిపోయాడు. మ్యాక్స్‌వెల్‌ క్రీజ్‌లో దిగుతున్నాడంటే భయపడే బౌలర్లు.. మ్యాక్సీనే కదా అనే స్థాయికి వచ్చేశాడు. ఏదో నాలుగైదు బంతులు ఆడి మనోడే వికెట్‌ను ఇస్తాడులే అనేంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. (‘ఇదొక భయంకరమైన పవర్‌ ప్లే’)

ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్‌ వంద బంతులను మాత్రమే ఆడాడు. అంటే మ్యాచ్‌కు వచ్చి సగటున పది బంతులు మాత్రమే ఆడిన ఘనత మ్యాక్సీది. ఇక్కడ మ్యాక్స్‌వెల్‌ చేసిన పరుగులు 102. ఈరోజు(శనివారం) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో  మ్యాక్సీ 13 బంతులాడి 12 పరుగులు చేశాడు.  దాంతో ఓవరాల్‌గా ఈ సీజన్‌లో వంద బంతుల్ని ఎదుర్కోవడంతో పాటు వంద పరుగుల్ని కూడా కష్టపడి పూర్తి చేసుకున్నాడు. పించ్‌ హిట్టర్లలో ఒకడైన మ్యాక్సీ 10 ఇన్నింగ్స్‌ల్లో ఒక సిక్స్‌ కూడా లేకపోవడం గమనార్హం. ఒక జట్టు ఎంతో నమ్మకంతో వరుసపెట్టి అవకాశాలు ఇస్తుంటే మనోడేమో ఇలా పేలవ ప్రదర్శనతో పంజాబ్‌ పరాజయాల్లో భాగమవుతున్నాడు. ఎవరైనా విజయాల్లో భాగమైతే అతనిపై ఆయా జట్లు కూడా నమ్మకం ఉంచుతాయి. మరి మ్యాక్సీ విఫలం కావడం అతని అంతర్జాతీయ కెరీర్‌పైనే కాకుండా లీగ్‌ల్లో కూడా ప్రభావం చూపడం ఖాయం. కాగా, నేటి మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 127 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరెంజ్‌ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో కింగ్స్‌ పంజాబ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో నికోలస్‌ పూరన్‌(32 నాటౌట్‌; 28 బంతుల్లో 2 ఫోర్లు)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. 

మరిన్ని వార్తలు