Glenn Maxwell: నేను అన్నది ఐపీఎల్‌లో కాదు.. విఫలమయ్యానని తెలుసు!

4 Oct, 2021 12:02 IST|Sakshi

Glenn Maxwell tweet goes viral: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఐపీఎల్‌-2021 సీజన్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆర్సీబీ తరఫున 12 మ్యాచ్‌లు ఆడిన అతడు 407 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 78. ఇక ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిసిన మాక్సీ.. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసి... మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం అన్ని వేళలా అంత సులభమేమీ కాదు. ప్రొఫెషనల్‌ క్రికెట్‌తో పాటు గత ఐపీఎల్‌ సీజన్లలో బాగా ఆడాను. అయితే, నేటి మ్యాచ్‌లో మాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. దానిని సద్వినియోగం చేసుకోవాలని భావించాను. వికెట్‌పై ఒక అంచనా వచ్చింది. గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియా తరఫున ఇదే విధంగా ఆడుతున్నా. అక్కడ నేను విజయవంతమయ్యాను. ఇక ఆర్సీబీ విషయానికొస్తే... వాళ్లు కూడా నన్ను ఇక్కడ ఇదే తరహా పాత్ర పోషించాలని కోరుకుంటున్నారు. డ్రెస్సింగ్‌రూంలో వాతావరణం ఎంతో బాగుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. 

కాగా 2019, గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో మ్యాక్స్‌వెల్‌ను రూ.10 కోట్లు వెచ్చించి కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌(ఇప్పటి పంజాబ్‌ కింగ్స్‌) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌- 13వ సీజన్‌లో మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యాడు. 2020 సీజన్‌లో పంజాబ్‌ తరఫున 13 మ్యాచ్‌లాడిన ఈ ఆసీస్‌ క్రికెటర్‌ మొత్తంగా 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పంజాబ్‌ ఫ్రాంఛైజీ అతడిని వదులుకుంది. ఈక్రమంలో.. ఐపీఎల్‌-2021 మినీ వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకోగా.. అద్భుతంగా రాణిస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో.. మాక్సీ చేసిన తాజా ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఆర్సీబీ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన అతడు.. ‘‘గత రెండేళ్లుగా నేను ప్రొఫెషనల్‌ క్రికెట్‌ బాగా ఆడుతున్నాను. ఐపీఎల్‌లో కాదు. గత సీజన్‌లో నేను విఫలమయ్యాయని నాకు తెలుసు’’ అని పేర్కొన్నాడు. పోస్ట్‌ మ్యాచ్‌ అనంతరం తాను మాట్లాడుతూ... బాగా ఆడాను అన్నది ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఒక ఆటగాడి గురించి రాసేటపుడు ఐపీఎల్‌ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటారంటూ తనను విమర్శిస్తూ కథనాలు రాసిన మీడియాకు ఈ సందర్భంగా కౌంటర్‌ ఇచ్చాడు.

మరిన్ని వార్తలు