టీమిండియాకు గొప్ప ఆటగాడు దొరికాడు: మెక్‌గ్రాత్‌

7 Dec, 2020 18:15 IST|Sakshi

సిడ్నీ: టీమిండియా బౌలర్‌ నటరాజన్‌పై ఆసీస్‌ క్రికెట్‌ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్‌‌ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా భారత్‌ నటరాజన్‌ రూపంలో గొప్ప ఆటగాడు లభించాడంటూ కొనియాడాడు. అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఇలాగే ఫామ్‌ను కొనసాగించాలని ఆకాంక్షించాడు. కాగా వన్డే సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్న తమిళనాడు పేసర్‌‌ నటరాజన్‌, అరంగేట్రంలోనే రెండు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా అప్పటికే ఆసీస్‌ చేతిలో 2-0తో సిరీస్‌ కోల్పోయిన కోహ్లి సేన చివరి వన్డేలో విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. మహ్మద్‌ షమీ స్థానాన్ని భర్తీ చేసిన అతడు.. తాను సరైన ఎంపిక అని రుజువు చేసుకున్నాడు.  (చదవండినటరాజన్‌ రాకతో షమీకి కష్టమేనా : మంజ్రేకర్‌)

అంతేకాక శుక్రవారం జరిగిన తొలి టీ20లో 4 ఓవర్లలో మూడు కీలక వికెట్లు(30 పరుగులు) తీసి సత్తా చాటాడు. అదే విధంగా.. ఆదివారం నాటి రెండో టీ20 మ్యాచ్‌లోనూ నిన్నటి మ్యాచ్‌లో నటరాజన్‌ నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 20 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అతడి కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగానే ఆసీస్‌ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. ఈ క్రమంలో భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుని బదులు తీర్చుకుంది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా కామంటేటర్‌ మెక్‌గ్రాత్‌ మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ కార్యక్రమంలో భాగంగా నటరాజన్‌ కలిసినట్లు పేర్కొన్నాడు. (చదవండి: నటరాజన్‌ అరంగేట్రం.. అద్భుతమైన కథ!)

ప్రస్తుతం అతడు బౌల్‌ చేస్తున్న తీరు అద్భుతమని, ఆస్ట్రేలియా పరిస్థితులకు తొందరగానే అలవాటు పడ్డాడని చెప్పుకొచ్చాడు. ఇకపై తాను వికెట్లు తీసేందుకు కేవలం యార్కర్లపై మాత్రమే ఆధారపడే పరిస్థితి లేదన్నాడు. నటరాజన్‌ ఆటతో తనను ఇంప్రెస్‌ చేశాడని ప్రశంసించాడు. కాగా 2015-16 ఆసీస్‌ టూర్‌లో భాగంగా బుమ్రా, 2018-19లో మయాంక్‌ అగర్వాల్‌ మెరుగైన ప్రదర్శనతో వెలుగులోకి రాగా ప్రస్తుతం నటరాజన్‌ సైతం ఆస్ట్రేలియా టూర్‌లోనే తనదైన ముద్ర వేయడం గమనార్హం. 

ఇక అరంగేట్ర మ్యాచ్‌ నుంచి మెరుగ్గా రాణిస్తున్న నటరాజన్‌పై ఇప్పటికే మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నటరాజన్‌ ఫామ్‌ చూస్తుంటే షమీ స్థానానికి ఎసరు వచ్చేలా ఉందని సంజయ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే విధంగా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి టీమిండియాకు ఆడటం వెనుక ఉన్న అతడి కఠోర శ్రమ గురించి క్రికెట్‌ దిగ్గజాలు ఇయాన్‌ బిషప్‌, టామ్‌ మూడీ సైతం ప్రస్తావిస్తూ... తనది మనసును హత్తుకునే అద్భుతమైన కథ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు