T20 WC 2022 NZ Vs SL: కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్‌ ఫిలిప్స్‌

29 Oct, 2022 16:27 IST|Sakshi

న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి తెర తీశాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12 గ్రూఫ్‌-1లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఫిలిప్స్‌ సెంచరీతో మెరిశాడు. 64 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో సెంచరీ.. ఇంతకముందు దక్షిణాఫ్రికా బ్యాటర్‌ రొసౌ ఈ టోర్నీలో తొలి సెంచరీ బాదాడు. అయితే గ్లెన్‌ ఫిలిప్స్‌ సెంచరీ చేయడం కంటే అతను క్రీజులో ప్రవర్తించిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. 

ఈ మధ్యనే క్రికెట్‌లో మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తూ దానిని చట్టబద్ధం చేసింది ఐసీసీ. ఇటీవలే దీప్తి శర్మ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ను మన్కడింగ్‌ చేయడాన్ని కొందరు సమర్థిస్తే.. మరికొందరు విమర్శించారు. ఆ విమర్శించిన వారిలో ఇంగ్లండ్‌కు చెందిన మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు సహా మరికొంత మంది మాజీ క్రికెటర్లు కూడా ఉ‍న్నారు. తాజాగా ప్రపంచకప్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్‌ మహ్మద్‌ వసీమ్‌ జూనియర్‌ పరుగు తీయాలనే తపనలో రూల్స్‌ మరిచిపోయాడు. బంతిని విడవకముందే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ క్రీజు నుంచి మూడు అడుగుల దూరం రావడం విస్మయపరుస్తుంది. పాక్‌ క్రికెటర్‌ చర్యను ఎండగడుతూ సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.

ఇదంతా ఒకవైపు జరుగుతున్న సమయంలోనే.. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ చర్య వైరల్‌గా మారింది. సాధారణంగా బంతిని విడవడానికి ముందు నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ క్రీజు దాటకూడదు. కానీ గ్లెన్‌ ఫిలిప్స్‌ కాస్త కొత్తగా ఆలోచించాడు. మాములుగా అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో ఎలాగైతే అథ్లెట్స్‌ ముందుకు వంగి రెడీగా ఉంటారో.. అచ్చం అలాగే.. ఫిలిప్స్‌ కూడా తన బ్యాట్‌ను బయట ఉంచి.. రన్నప్‌కు సిద్ధం అన్నట్లుగా క్రీజులో ఉండడం ఆకట్టుకుంది. బౌలర్‌ బంతి విడవగానే పరిగెత్తడం ప్రారంభించాడు. ఇదంతా కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్‌లో జరిగింది.

నిజంగానే క్రికెట్‌లో ఇదో కొత్త రకం ప్రయోగం అని చెప్పొచ్చు. అందుకే ఫిలిప్స్‌ చర్య సోషల్‌ మీడియాలో అంతగా వైరల్‌ అవుతుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఫిలిప్స్‌ సెంచరీ మినహాయిస్తే మరే ఇతర బ్యాటర్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. డారిల్‌ మిచెల్‌ ఒక్కడే 22 పరుగులు చేశాడు. దీంతో కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌ అవకాశాలు మరింత మెరుగయ్యే చాన్స్‌ ఉండడంతో కివీస్‌ బౌలర్లు రెచ్చిపోతున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ లంకను కష్టాల్లో పడేశారు.

చదవండి: లాల్‌ మంత్రం పని చేసింది.. జింబాబ్వేను మార్చేసింది

పరుగు కోసం రూల్స్‌ మరిచాడు.. పాక్ బ్యాటర్‌ తప్పిదం

మరిన్ని వార్తలు