చిక్కుల్లో క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌..

23 Nov, 2022 13:58 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డాడు. గోవా ప్రభుత్వం యువరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. విషయంలోకి వెళితే.. గోవాలోని  మోర్జిమ్ ప్రాంతంలో యువీకి 'కాసా సింగ్' పేరిట ఒక విల్లా ఉంది. గత సెప్టెంబర్‌లో ఈ విల్లాను అద్దెకు ఇస్తానంటూ యువీ తన ట్విటర్‌ వేదికగా ప్రకటన చేశాడు. గోవా రూల్స ప్రకారం ఇది ఒక విధంగా పేయింగ్ గెస్ట్ విధానం కిందకు వస్తుంది. దీనికి గోవా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. 

పేయింగ్ గెస్ట్ విధానం కింద విల్లాను అద్దెకు ఇవ్వాలంటే గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యూవీ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అద్దె ఇవ్వడం అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీనిని గోవా అధికారులు తప్పుబడుతూ రూ.లక్ష జరిమానా విధించారు.

అంతేకాదు డిసెంబర్‌ 8న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేశారు. పర్యాటక శాఖ చట్టాన్ని ఉల్లంఘించిన క్రమంలో ఎందుకు రూ. లక్ష జరిమానా విధించకూడదో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించారు. ఎవరైనా సరే గోవాలో హోటల్/గెస్ట్‌ హౌస్ కార్యకలాపాలు నిర్వహించాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర టూరిజం శాఖ ఇదివరకే స్పష్టం చేసింది.

చదవండి: 'నెంబర్‌ వన్‌ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు'

బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్‌ యునైటెడ్‌ తెగదెంపులు

మరిన్ని వార్తలు