Turkey Earthquake: విషాదం.. గోల్‌కీపర్‌ కన్నుమూత

8 Feb, 2023 13:08 IST|Sakshi

టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం దాటికి వేలాది మంది మృత్యువాత పడ్డారు. సోమవారం సంభవించిన భూప్రకంపనల్లో వందలాది భవనాలు కుప్పకూలగా.. వాటి శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. ఇప్పటికి రెస్క్యూ బృందం శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీస్తున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలు, రోదనలే.

ఇప్పటిదాకా టర్కీలో 5,400 మందికి పైగా, సిరియాలో 1,800కి పైగా మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. పూర్థిస్థాయిలో శిథిలాల తొలగింపు జరిగితే మరణాల సంఖ్య 20 వేలకు పైనే దాటోచ్చని డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే టర్కీకి చెందిన 28 ఏళ్ల ఫుట్‌బాలర్‌.. గోల్‌కీపర్‌ అహ్మత్‌ ఎయుప్‌ తుర్క్‌స్లాన్‌ మృత్యువాత పడ్డాడు.

శిథిలాల కింద చిక్కుకున్న ఎయుప్‌ కన్నుమూసినట్లు యేని మాలత్యస్పోర్ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తన ట్విటర్‌లో ధృవీకరించింది. మాకు ఇది విషాదకర వార్త. గోల్‌ కీపర్‌ ఎయుప్‌ తుర్క్‌స్లాన్‌ మృత్యువాత పడ్డాడు. శిథిలాల కింద చిక్కుకున్న అతన్ని రక్షించలేకపోయాం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అంటూ ట్వీట్‌ చేసింది. 2011లో కెరీర్‌ ప్రారంభించిన ఎయుప్‌ తుర్క్‌స్లాన్‌ అన్ని క్లబ్‌లకు కలిపి 80 మ్యాచ్‌ల్లో గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. ఇక ఘనాకు చెందిన మరో ఫుట్‌బాలర్‌ క్రిస్టియన్‌ అట్సూ మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు టర్కిష్‌ ఫుటబాల్‌ సూపర్‌ లీగ్‌ క్లబ్‌ పేర్కొంది.

చదవండి: టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్‌ ఫుట్‌బాలర్‌

LeBron James: సంచలనం.. 40 ఏళ్ల రికార్డు కనుమరుగు

మరిన్ని వార్తలు