Women's Hockey: అద్భుతం, గోల్డ్‌ మెడల్‌ తీసుకురండి!!

2 Aug, 2021 13:22 IST|Sakshi

భారత మహిళల హాకీ జట్టు విజయంపై మాజీ కెప్టెన్ అశోక్ ధ్యాన్ చంద్ స్పందన

స్వర్ణ పతకంపై ఆశాభావం

 క్రెడిట్‌ అంతా గోల్‌ కీపర్‌ గుర్‌జీత్‌కే

సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు దూసుకుపోతోంది.  క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాపై  ఘన విజయం సాధించి సెమీస్‌లోకి ఎంటరవ్వడం మాత్రమే కాదు సరికొత్త చరిత్రను లిఖించుకుంది. దీనిపై హాకీ మాజీ కెప్టెన్ అశోక్ ధ్యాన్ చంద్ స్పందించారు. మ్యాచ్‌ మొత్తంలో ఎక్కడా ఒక్క పొరపాటు కూడా చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఆస్ట్రేలియా  ఆశలు గల్లంతయ్యాయని  ఆయన ట్వీట్‌ చేశారు.  ఈ ఘనత అంతా డీఫెన్స్‌, గోల్‌ కీపర్‌ గుర్‌జీత్‌కే దక్కుతుందని  ప్రశంసించారు. ఈ విజయంతో బంగారం పతకం ఆశలకు మహిళల జట్టు మరింత చేరుకుందన్నారు.  హాకీలో స్వర్ణం భారత్‌కు వారసత్వంగా వస్తోంది. గోల్డ్‌ సాధించి ఈ లెగసీని మహిళల జట్టు సాధించనుందనే ఆశాభావాన్ని ధ్యాన్‌ చంద్‌ వ్యక్తం చేశారు. 

భారత మహిళల హాకీ జట్టుపై దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది. పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులతోపాటు భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఫారెల్ కూడా హాకీ జట్టును  అభినందించారు.  'గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా' సవితా పునియాను ఓడించలేమని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా  సెమీ, గ్రాండ్ ఫైనల్స్‌కు శుభాకాంక్షలు అందించారు. అమ్మాయిలు మీరు చరిత్ర సృష్టించారు! నమ్మశక్యంకానీ  ఆటతీరును ప్రదర్శించారు.  ఇక గోల్డ్‌ మెడల్‌ తీసుకురండి" అని భారత మాజీ ఆటగాడు లాజరస్ బార్లా ట్వీట్ చేశారు.

కాగా ఉత‍్కంఠ సాగుతున్న మ్యాచ్‌లో గుర్‌జీత్ సంచలన గోల్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇది చరిత్రలో నిలిచిపోయే గోల్ అంటూటోక్యో 2020 ఫర్ ఇండియా  ట్వీట్‌ చేయడం విశేషం.  అటు 49 ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు