Mira bhai chanu: 2016లో చానుకి ఏమైంది? తల్లి భావోద్వేగం

24 Jul, 2021 21:32 IST|Sakshi

2016 ఒలింపిక్స్‌లో పతకం ఆశలు గల్లంతు

క్లీన్ అండ్ జెర్క్‌ సమయంలో వైఫల్యం

దీంతో మానసిక ఒత్తిడి

2017లో బౌన్స్‌ బ్యాక్‌

2021లో  టోక్యో ఒలింపిక్స్‌ రజతం

సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో బంగారం పతకం దక్కకపోయినా..బంగారం లాంటి తన బిడ్డ మీరాబాయ్ విజయాన్ని చూసి ఆమెతల్లి భావేద్వేగానికి లోనయ్యారు. తమ కష్టం ఫలిచిందంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. ఈ సందర్బంగా ఇంతటి అద్భుతాన్ని సాధించేందుకు మీరాబాయి పడిన శ్రమను, కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే తల్లి సైఖోమ్ ఒంగ్బీ టోంబి లీమా ఆమెకు తను బహుమతిగా ఇచ్చిన చెవిరంగులపై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

దాదాపు 21 ఏళ్ల త‌ర్వాత‌ ఒలింపిక్స్‌ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భార‌త్‌కు మెడ‌ల్ సాధించిన ఘనత మ‌ణిపూర్‌కు చెందిన మీరాబాయి చాను సొంతం. టీవీలో చాను చెవిపోగులు చూశాను, (రియో) ఒలింపిక్స్‌కు ముందు తానే వాటిని 2016లో ఆమెకు ఇచ్చానంటూ చాను  తల్లి చెప్పారు. అవి అదృష్టం..విజయాన్ని తీసుకొచ్చాయంటూ ఆమె మురిసిపోయారు. తను చెవి రింగుల‌ను చూసిన‌ప్పుడ‌ల్లా చానులో ప‌ట్టుద‌ల మ‌రింత పెరిగిందని తల్లి ఉద్వేగంతో చెప్పారు. చాను పతకాన్ని సాధించడంతో తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పుకొచ్చారు. ఈ ఒలింపిక్స్‌లో క‌చ్చితంగా గోల్డ్ మెడ‌ల్‌ సాధిస్తానని చెప్పిందనీ, కనీసం ఏదో ఒక ప‌త‌కంతో వ‌స్తాన‌ని చాను చెప్పిందని వెల్లడించారు. ఒలింపిక్‌ రింగ్స్‌ లా కనిపించే వీటి వివరాలను పరిశాలిస్తే.. 2016 రియో ఒలిపింక్స్‌..సందర్బంగా చానూకు చెవిదిద్దుల‌ తయారీకోసం తల్లి తన దగ్గర ఉన్న చిన్నా చితకా బంగారాన్ని మొత్తం అమ్మేసారట.

2016 రియో ఒలింపిక్స్‌లో చాను ఆశలు ఆవిరి
2016 రియో ఒలింపిక్స్‌లో 192 కిలోల విభాగంలో 190 కిలోల బరువును ఎత్తి తన గురువు  కుంజారాణి దేవి రికార్డును బద్దలు కొట్టారు. కానీ క్లీన్ అండ్ జెర్క్‌లో బరువు ఎత్తుతున్న సమయంలో పట్టు కోల్పోయింది. 21ఏళ్ల మీరాబాయి చాను సరిగ్గా 22వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు 2016లొ క్లీన్ అండ్ జెర్క్‌లో ఆమె చేసిన మూడు ప్రయత్నాలు విఫలమైనాయి. దీంతో పతకం కలలు కల్లలై పోయాయి. ఫలితంగా తీవ్ర డిపప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు. ఇందుకు ఆమె మానసిక వైద్యులను కూడా సంప్రదించారు. కట్‌ చేస్తే.. అయిదేళ్ల తరువాత అటు తన కలను, ఇండియా కలను నెరవేర్చారు.

చాను ఇంట్లో సంబరాలు
కోచింగ్‌ కారణంగా చాలా తక్కువగా ఇంటికి వస్తుందని అందుకే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేసుకున్నామని చాను బంధువు అరోషిని చెప్పారు. గేమ్‌కు వీడియో కాల్ చేసి, అందరికీ నమస్కరించి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుందని చెప్పారు. చాను సాధించిన అపూర్వ విజయంతో రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంగ్‌పోక్ కాచింగ్ గ్రామంలోని చాను ఇల్లు సంబరాలతో నిండిపోయింది. కరోనా కారణంగా కొంతవరకు కర్ఫ్యూ ఉన్నప్పటికీ శుక్రవారం నుంచే ఆమె ఇంటి వద్ద సందడి మొదలైంది. చానుకు ఆరుగురు తోబుట్టువులు. ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు.

కోచ్‌ కుంజారాణీ దేవి స్పందన
ఇంఫాల్‌లో జన్మించిన చాను మరో మణిపురి వెయిట్‌లిఫ్టర్ కుంజారాని దేవి స్ఫూర్తితోనే వెయిట్ లిఫ్టింగ్ ఎంచుకున్నారు. కుంజారాణీ దేవి చాలా  గొప్ప క్రీడాకారిణి అని చాను ఒక సందర్భంలో చెప్పారు. చిన్నప్పటినుంచి  ఆమె  గురించి పుస్తకాల్లో, పేపర్లో చదివాను.. అందుకే నేను భారీ బరువులు ఎత్తి ప్రపంచానికి చూపాలనుకున్నాను అని  చాను  గతంలో తెలిపారు. తాజా చాను విజయంపై కుంజారాణి స్పందించారు. 2011లో జూనియర్ జాతీయ శిబిరానికి వచ్చినప్పుడు ఆమెను మొదటిసారి చూశాను. ఆమెలో చాలా ప్రతిభ, సంకల్ప బలం చాలా ఉన్నాయి. మిగతా అథ్లెట్లతో పోలిస్తే మీరా చాలా టాలెంటెడ్‌. కోచ్‌లు చెప్పే ప్రతిదాన్ని అనుసరిస్తూ తెలివిగా ఆడేదని, అదే ఆమెను ఒలింపిక్స్‌లో పతకం సాధించేలా చేసిందని 2015 వరకు చానుకు కోచ్‌గా ఉన్న కుంజరాణి దేవి  అన్నారు. ఒలింపియన్ కావాలనుకుంటే లేదా పతకం సాధించాలన్నా. లేదా అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న వంటి అవార్డులు గెలుచుకోవాలనుకుంటే, కష్టపడి పనిచేయాలని చెప్పానని శనివారం తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఆమెలోని చిన్న లోపాలను తీర్చడానికి మాత్రమే తాను సహాయపడ్డానని తెలిపారు.2016 ఒత్తిడినుంచి బైటపడి 2017లో తిరిగి బౌన్స్ బ్యాక్‌ అయిందన్నారు. అయితే 2018నుండి మిరాబాయితో మాట్లాడలేక పోయినా.. ఆమె విజయాలను గమనిస్తున్నాననీ,  ఈ రోజు తన స్టూడెంట్‌ మొత్తం భారతదేశం గర్వపడేలా చేసిందంటూ ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు