ప్రపంచకప్‌ టోర్నీ ఎంట్రీ సంక్లిష్టం! అయినా.. వన్డే సిరీస్‌ రద్దు సరైన నిర్ణయమే!

4 Aug, 2022 12:52 IST|Sakshi
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ రద్దు చేసుకున్న దక్షిణాఫ్రికా (PC: Cricket Australia)

CSA T20 Challenge 2022: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను రద్దు చేసుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు నిర్ణయాన్ని ప్రొటిస్‌ మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ సమర్థించాడు. కొత్తగా ప్రవేశపెట్టనున్న టీ20 లీగ్‌ కోసం బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకోడంలో ఎలాంటి తప్పులేదని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియా బోర్డుతో ఎన్ని సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయిందన్న స్మిత్‌.. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చాడు. 

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ సూపర్‌లీగ్‌లో భాగంగా వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. జనవరి 12 నుంచి 17 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. అయితే, దక్షిణాఫ్రికాలో కొత్తగా టీ20 క్రికెట్‌ లీగ్ ఆరంభించనున్న నేపథ్యంలో షెడ్యూల్‌ను మార్చాల్సిందిగా ప్రొటిస్‌ బోర్డు.. ఆసీస్‌కు విజ్ఞప్తి చేసింది.


గ్రేమ్‌ స్మిత్‌

కుదరదు!
కానీ, అప్పటికే తమ అంతర్జాతీయ కాలెండర్‌ నిండిపోయిన కారణంగా తేదీలు సర్దుబాటు చేసే అవకాశం లేకపోవడంతో అక్కడి నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో విధిలేక దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీలో నేరుగా అడుగుపెట్టే అవకాశాలను దక్షిణాఫ్రికా చేజేతులా సంక్లిష్టతరం చేసుకున్నట్లయింది.

సూపర్‌లీగ్‌ పాయింట్ల పట్టికలో పదకొండో స్థానంలో ప్రొటిస్‌.. భారత్‌ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్‌లో అడుగుపెట్టాలంటే క్వాలిఫికేషన్‌ రౌండ్‌ ఆడాల్సిన పరిస్థితి. దీంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తీరుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

సరైందే!
ఈ విషయంపై తాజాగా స్పందించిన గ్రేమ్‌ స్మిత్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడాడు. ‘‘సొంతగడ్డపై ఇలాంటి మ్యాచ్‌లు(టీ20) ఆదాయం తెచ్చిపెడతాయి. మా క్రికెట్‌ లీగ్‌ ప్రయోజనాల కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. క్రికెట్‌ ఆస్ట్రేలియాతో అన్ని రకాలుగా చర్చించాం. రీషెడ్యూల్‌ విషయమై ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చాం. అయినా, వర్కౌట్‌ కాలేదు’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా దక్షిణాఫ్రికా టి20 లీగ్‌కు గ్రేమ్‌ స్మిత్‌ కమిషనర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికా సెప్టెంబరులో టీమిండియా పర్యటనకు రానున్నట్లు బీసీసీఐ బుధవారం ధ్రువీకరించింది. భారత్‌లో ప్రొటిస్‌ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

చదవండి: South Africa T20 League: పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్‌.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. మినీ ఐపీఎల్‌ తలపిస్తోంది
Zim Vs Ban: మరీ జింబాబ్వే చేతిలోనా.... అస్సలు ఊహించలేదు! మాకిది ఘోర అవమానం!

మరిన్ని వార్తలు