కోహ్లి.. ఓ చాంపియన్‌‌.. తొలగిస్తే నేరం చేసినట్లే: గ్రేమ్‌ స్వాన్‌

25 Jun, 2021 18:04 IST|Sakshi

లండన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమిండియా ఓటమికి విరాట్‌ కోహ్లిని బాధ్యుడిని చేస్తూ సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలనడం సరికాదని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అన్నాడు. కోహ్లిని గనుక కెప్టెన్సీ నుంచి తప్పిస్తే క్రికెట్‌ పట్ల పెద్ద నేరం చేసినవారవుతారని వ్యాఖ్యానించాడు. అతడు వంద శాతం నిబద్ధతతో ఆడతాడని, అలాగే జట్టును ముందుండి నడిపిస్తాడని పేర్కొన్నాడు.

కేవలం సన్నద్ధలేమి వల్లే భారత జట్టు ఓడిపోయిందని, అంతేతప్ప ఇందుకు కోహ్లి కారణం కాదని చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జట్టు కూర్పు సరిగ్గా లేనందుకు వల్లే పరాజయం పాలవ్వాల్సి వచ్చిందని, ఇందుకు కోహ్లినే బాధ్యత వహించాలని సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఇంగ్లిష్‌ జట్టు మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ మాట్లాడుతూ... ‘‘విరాట్‌ కోహ్లి ఓ చాంపియన్‌. తనకొ సూపర్‌స్టార్‌. భారత జట్టులో జవసత్వాలు నింపాడు. వికెట్లు పడినప్పుడు, మిస్‌ఫీల్డింగ్‌ జరిగినపుడు తన ముఖంలో వచ్చే మార్పులు అతడి మానసిక స్థితిని తెలియజేస్తాయి. పూర్తి నిబద్ధతతో తన బాధ్యతలు నెరవేరుస్తాడు. కానీ ఒక్క ఓటమి కారణంగా తనను తొలగించాలని మాట్లాడటం పద్ధతి కాదు.

ఇంత మంచి కెప్టెన్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తే పెద్ద నేరం చేసినట్లే లెక్క. వాళ్లు(భారత జట్టు యాజమాన్యం) కెప్టెన్‌ మార్పు గురించి అస్పలు ఆలోచించరనే అనుకుంటున్నా. నిజానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోవడం వల్లే భారత్‌ ఓడిపోయింది. సౌథాంప్టన్‌లో వారికి తగినంత నెట్‌ ప్రాక్టీసు లభించలేదు. అదే సమయంలో న్యూజిలాండ్‌కు కావాల్సినంత సమయం దొరికింది. అదే వారికి అడ్వాంటేజ్‌గా మారింది’’ అని ఫైనల్‌ ఫలితానికి గల కారణాలు విశ్లేషించే ప్రయత్నం చేశాడు. 

చదవండి: WeWantANewCaptain: సమయం ఆసన్నమైంది కోహ్లీ.. దిగిపో!

మరిన్ని వార్తలు