గంగూలీది కష్టపడే తత్వం కాదు.. కానీ: చాపెల్‌

20 May, 2021 14:51 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, టీమిండియా మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ మరోసారి సౌరవ్‌ గంగూలీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గంగూలీది కష్టపడే తత్వం కాదని, కెప్టెన్‌గా ఎప్పుడూ పెత్తనం చెలాయించడమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించాడు. కాగా 2005- 2007 మధ్య కాలంలో గ్రెగ్‌ చాపెల్‌ భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ రెండేళ్లలోనే, అప్పటి టీమిండియా సారథి గంగూలీ, చాపెల్‌ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. 

ముఖ్యంగా, చాపెల్‌ హయాంలోనే గంగూలీ కెప్టెన్సీ చేజారడం, ఆటగాడిగా తుదిజట్టులో కూడా చోటు దక్కకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. దీంతో వీరిద్దరు ఇప్పటికే ఎన్నోసార్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో, తన ఆత్మకథ ఏ సెంచరీ 'ఈజ్ నాట్ ఎనఫ్'లో తన క్రికెట్‌ కెరీర్‌లో చేసిన అతి పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే అది ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌ను కావాలని కోచ్‌గా నియమించుకోవడమేనని పేర్కొన్నాడు. 

అదే విధంగా, తన మానసిక స్థితి బాలేదంటూ బీసీసీఐకి చాపెల్‌ రాసిన లేఖ వల్ల తన కెరీర్‌ నాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక చాపెల్‌ సైతం వీలు చిక్కినప్పుడల్లా గంగూలీని విమర్శిస్తూనే ఉన్నాడు. తాజాగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఆ రెండేళ్ల పాటు ఎటువైపు చూసినా కఠిన సవాళ్లే. అంచనాలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు సౌరవ్‌ కెప్టెన్సీ గురించి చర్చ. నిజానికి తనది కఠినంగా శ్రమించే తత్వం కాదు. అయితే, కెప్టెన్‌గా మాత్రం తానే ఉండాలనుకునేవాడు. అలా అయితే, పరిస్థితులన్నీ తన అదుపులోనే ఉంటాయన్న భావన తనది’’ అని వ్యాఖ్యానించాడు.

అయితే, మొదట్లో గంగూలీతో తనకు సఖ్యత ఉందన్న చాపెల్‌.. ‘‘టీమిండియా కోచ్‌గా రమ్మని మొదట గంగూలీయే నన్ను సంప్రదించాడు. నాకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోని పటిష్టమైన దేశపు జట్టుతో పనిచేయాలని ఉండేది. గంగూలీ వల్లే నాకు ఆ అవకాశం దక్కిందని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. 

చదవండి: T20 World Cup: భారత్‌లో వద్దు.. వేదిక మార్చండి: హస్సీ

మరిన్ని వార్తలు