IPL 2023 GT VS RR: హార్ధిక్‌ పాండ్యా అరుదైన రికార్డు.. రాజస్థాన్‌ రాయల్స్‌ చెత్త రికార్డు

17 Apr, 2023 12:44 IST|Sakshi
photo credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య నిన్న (ఏప్రిల్‌ 16, రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (26 బంతుల్లో 56 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (32 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో రాజస్థాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (45), మిల్లర్‌ (46) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. రాజస్థాన్‌ సైతం 7 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 

కాగా, ఈ మ్యాచ్‌ పలు ఆసక్తికర గణాంకాలకు వేదికైంది. అవేంటంటే..

  • ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా 2000 ఐపీఎల్‌ పరుగుల మార్కును అధిగమించాడు. ఈ క్రమంలో అతను ఐపీఎల్‌లో 2000 పరుగులు పూర్తి చేసి 50 వికెట్లు పడగొట్టిన ఆరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 
  • ఈ మ్యాచ్‌లో మెరుపు హాఫ్‌ సెంచరీ చేసిన షిమ్రోన్‌ హెటమైర్‌ ఐపీఎల్‌లో ఐదో అత్యుత్తమ బ్యాటింగ్‌ స్ట్రయిక్‌ రేట్‌ (157.20) కలిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు (కనీసం 500 పరుగులు చేసిన ఆటగాళ్లలో). ఈ విభాగంలో ఆండ్రీ రసెల్‌ (177.09) అగ్రస్థానంలో ఉన్నాడు.
  • ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ చెత్త రికార్డు నమోదు చేసింది. ప్రస్తుత సీజన్‌లో పవర్‌ ప్లేలో అత్యల్ప స్కోర్‌ (26/2) నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది.
  • ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌కు ఇది మొట్టమొదటి విజయం. గతంలో (2002 సీజన్‌) ఈ ఇరు జట్లు తలపడిన 3 సందర్భాల్లో గుజరాత్‌నే విజయం వరించింది.  
>
మరిన్ని వార్తలు