గుణతిలక ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌’

11 Mar, 2021 08:49 IST|Sakshi

నార్త్‌సౌండ్‌: వెస్టిండీస్‌, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఓపెనర్‌ గుణతిలక అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌గా‌ వెనుదిరిగాడు.నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్‌ బంతిని కావాలని అడ్డుకుంటేనే దానిని అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌గా పరిగణిస్తారు. శ్రీలంక ఇన్నింగ్ష్‌ 22వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కీరన్‌ పొలార్డ్‌ వేసిన ఆ ఓవర్‌ మొదటి బంతిని నిసాంకా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అతడిని వారిస్తూ ముందుకొచ్చిన గుణతిలక... వెనక్కి వెళ్లే ప్రయత్నంలో బంతిపై కాలు పెట్టాడు.

అయితే పొలార్డ్‌ సహా ఇతర విండీస్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా అంపైర్లు గుణతిలకను అవుట్‌గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం గుణతిలక  అసలు బంతి ఎక్కడ ఉందో చూడకుండా వెనక్కి జరగడాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అర్థమవుతోంది.అయితే ఒక ఆటగాడు అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌ కింద వన్డేల్లో ఔటవ్వడం ఇది ఏడోసారి. ఇంతకముందు వన్డేల్లో 6 సార్లు, టెస్టుల్లో ఒకసారి.. టీ20ల్లో ఒకసారి బ్యాట్స్‌మన్‌ ఈ పద్దతిలో ఔటయ్యాడు.అతను కావాలని అలా చేశాడో.. లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ నిబంధనల ప్రకారం గుణతిలకను అవుట్‌గా ప్రకటించారని మ్యాచ్‌ అనంతరం విండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. గుణతిలక (55), కరుణరత్నే (52), ఆషెన్‌ బండార (50) అర్ధ సెంచరీలతో రాణించారు. విండీస్‌ బౌలర్లలో హోల్డర్‌,  జాసన్‌ మొహమ్మద్‌ 2, పొలార్డ్‌ , పాబియెన్‌ అలెన్‌, జోసెఫ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 47ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. షై హోప్‌ 110 పరుగులతో ఆకట్టుకోగా.. ఎవిన్‌ లూయిస్‌ 65 అతనికి సహకరించాడు. ఈ విజయంతో విండీస్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 12న జరగనుంది.
చదవండి: 
'ద్రవిడ్‌ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు'

>
మరిన్ని వార్తలు