Gustav McKeon T20I Records: 18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్‌?

29 Jul, 2022 08:21 IST|Sakshi

ఫ్రాన్స్‌ టీనేజ్‌ క్రికెటర్ గుస్తవ్‌ మెకియోన్ 18 ఏళ్ల వయసులోనే టి20 క్రికెట్‌లో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. మూడు రోజుల కిందట టి20 క్రికెట్‌లో సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కిన గుస్తవ్‌ మెకియోన్‌ తాజాగా మరో శతకం అందుకున్నాడు. టి20 క్రికెట్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా గుస్తవ్‌ మెకియోన్‌ నిలిచాడు. 

యూరోప్‌ టి20 వరల్డ్‌కప్‌ 2024 సబ్‌-రీజినల్స్‌లో భాగంగా గ్రూఫ్‌-బిలో నార్వేతో జరిగిన మ్యాచ్‌లో గుస్తవ్‌ 53 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 101 పరుగులు సాధించాడు. అతనికి ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. అంతకముందు ఆదివారం(జూన్‌ 24న) స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో 61 బంతుల్లోనే తొలి శతకం మార్క్‌ను అందుకున్నాడు. ఇదే వరల్డ్‌కప్‌లో చెక్‌ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌తో టి20 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన గుస్తవ్‌ ఆరంభమ్యాచ్‌లోనే 54 బంతుల్లో 76 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే గుస్తవ్‌ మరో అరుదైన ఫీట్‌ సాధించాడు. వరుసగా తొలి మూడు టి20 మ్యాచ్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ  చరిత్ర సృష్టించాడు. వరుసగా తొలి మూడు టి20ల్లో 76, 109, 101 పరుగులు.. మొత్తంగా 26 పరుగులు సాధించి గుస్తవ్‌ తొలి స్థానంలో ఉ‍న్నాడు. ఇక పోర్చుగల్‌కు చెందిన క్రికెటర్‌ అజర్‌ అదానీ 227 పరుగులతో రెండో స్థానంలో.. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన సబావున్‌ దావీజీ 208 పరుగులతో మూడో స్థానంలో.. నేపాల్‌ క్రికెటర్‌ కుషాల్‌ బుర్తెల్‌ 185 పరుగులతో నాలుగో స్థానం.. పాకిస్తాన్‌కు చెందిన ముక్తార్‌ అహ్మద్‌ 182 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫ్రాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక్కడ విచిత్రమేంటంటే గుస్తవ్‌ మెకియోన్‌ ఒక్కడే 101 పరుగులు చేయగా.. తర్వాత జట్టులో అత్యధిక స్కోరు 15 మాత్రమే. అనంతరం బ్యాటింగ్‌ చేసిన నార్వే 19.2 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. సెంచరీతో చెలరేగిన గుస్తవ్‌ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి మూడు వికెట్లతో గుస్తవ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

చదవండి:  ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు.. ఫుల్‌ జోష్‌లో ముంబై!

Martin Guptill: రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు.. కివీస్‌ తరపున తొలి ఆటగాడిగా

మరిన్ని వార్తలు