గుట్కా మ్యాన్‌ అంటూ ట్రోలింగ్‌.. అసలు విషయం తెలిస్తే షాక్‌!

27 Nov, 2021 17:58 IST|Sakshi

క్రికెట్‌కు సంబంధించి మ్యాచ్‌ గెలుపోటములు, ఆటగాళ్ల ప్రదర్శన, అభిమానుల తీరు అన్నింటిపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌, మీమ్స్‌ ట్రెండ్‌ అవుతుంటాయి. అయితే భారత్‌లో ప్రస్తుతం పూర్తిస్థాయిలో క్రికెట్‌ ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తుంది. న్యూజిలాండ్‌ టీమిండియా పర్యటనలో భాగంగా కాన్పూర్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే.

కాగా ఆట మొదటిరోజులో భాగంగా మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకుల వైపు కెమెరా తిరిగింది. స్టాండ్‌లో ఉన్న వ్యక్తిపైకి కెమెరా ఫోకస్‌ మరింత దగ్గరగా వెళ్లింది. అతను గుట్కా నములుతూ.. ఫోన్‌ సంభాషిస్తున్నట్లు కని​పించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారటంతో అతనిపై ఫన్నీగా మీమ్స్‌ క్రియేట్‌ చేసి ట్రోల్‌ చేశారు. మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్ కూడా ఓ ఫన్నీ మీమ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌చేశారు.

ఇక ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నగరం  పొగాకు, పాన్ మసాలాకు ప్రసిద్ధి చెందింది కావటంతో నెటిజన్లు అతనిపై విపరీతంగా జోకులు, మీమ్స్ పేల్చుతున్నారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి శోభిత్‌ పాండేగా గుర్తించారు. అతను కాన్పూర్‌లోని మహేశ్వరీ మహల్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే శోభిత్‌ పాండే రెండో రోజు(శుక్రవారం) కూడా టెస్ట్‌ మ్యాచ్‌ చూడడానికి వచ్చాడు.

అయితే అతనిపై మళ్లీ కెమెరా ఫోకస్‌ కాగా.. ‘గుట్కా నమలడం చెడు అలవాటు’ అని ఓ ప్లకార్డు కనిపించింది. అయితే శోభోత్‌ పాండే మీడియాతో మాట్లాడుతూ.. తనకు అసలు గుట్కా తినే అలవాటు లేదని తెలిపాడు. కేవలం తమలపాకు తింటూ మరోస్టాండ్‌లోని తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నానని చెప్పాడు.


అయితే సదరు వ్యక్తి బాధ ఏంటంటే.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో తన సోదరి తనతోపాటు ఉండటం, ఆమెపై కూడా కామెంట్లు రావడమని పేర్కొన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అందుకే చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపాడు. తన సోదరిపై కూడా కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు. అదే విధంగా తనకు చాలా మీడియా సంస్థల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని దీంతో చాలా చిరాకుగా ఉందని తెలిపాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 345 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 43 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ మూడోరోజు ఆట ముగిసేసమయానికి 5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 14 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మరిన్ని వార్తలు