జాతీయ గీతానికి అవమానం! ఆమెది తలపొగరేనా?

29 Jun, 2021 13:05 IST|Sakshi

ఆమెది మామూలు తలపొగరు కాదు. తిక్క కుదర్చాల్సిందే. ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది. జాతీయ గీతం అంటే ఆమెకు లెక్కే లేదు. దేశమంటే గౌరవమూ లేదు. ముందు ఆమెను ఒలింపిక్స్‌కు పోనివ్వకుండా అడ్డుకోండి.. ఇది యూఎస్‌ ఒలింపిక్స్‌ కమిటీకి చేరుతున్న ఫిర్యాదులు. హామర్‌ థ్రో క్రీడాకారిణిగా ఒలింపిక్స్‌కు వెళ్లబోతున్న గ్వెన్‌ బెర్రీని.. అక్కడి ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే.. 

న్యూయార్క్‌: శనివారం నాడు యూఎస్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఒలింపిక్‌ ట్రయల్స్‌ జరిగాయి. హమర్‌ థ్రో విభాగంలో మూడో ప్లేస్‌లో నిలిచింది 32 ఏళ్ల గ్వెన్‌ బెర్రీ. ఆపై మెడల్స్‌ బహుకరణ తర్వాత.. జాతీయ గీతం ప్రదర్శించిన టైంలో పోడియం వద్ద ఆమె తలబిరుసు ప్రదర్శించింది. ఆ టైంలో ఆమె మిగతా ఆటగాళ్లకు వ్యతిరేక దిశలో నిలబడింది. పైగా ఏ మాత్రం గౌరవం లేకుండా.. నడుం మీద చెయ్యి వేసుకుంది. జాతీయ గీతం అంటే ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరించింది. అంతకు ముందు నెత్తి మీద నల్ల గుడ్డతో నిరసన కూడా వ్యక్తం చేసింది. అందుకే ఆమె మీద  అమెరికన్లు మండిపడుతున్నారు.

నాకంత ఓపిక లేదు 
దీనిపై బెర్రీ వివరణ ఇచ్చుకుంది. ఐదు నిమిషాలు తమను ఎండలో ఎదురుచూసేలా చేశారని, అందుకే అలా చేశానని చెప్పింది. ఇక బెర్రీ చేష్టలపై దుమారం చెలరేగింది. రాజకీయ నేతలంతా ఆమెపై విరుచుకుపడ్డారు. మరోవైపు శాంతియుత నిరసన ప్రదర్శన కావడంతో వైట్‌ హౌజ్‌ కూడా ఆమె తప్పును మన్నించినట్లు ప్రకటించింది. అయినా విమర్శలు మాత్రం ఆగట్లేదు. ఆమెను ఒలింపిక్స్‌కు వెల్లనీయకుండా అడ్డుకోవాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ యూఎస్‌ ఒలింపిక్స్‌ కమిటీకి పలువురు మెయిల్స్‌ పెడుతున్నారు.

కొనసాగుతున్న నిరసన
కానీ, ఆమె ఉద్దేశం అది కానే కాదు. అది నిరసన. నల్ల జాతీయలపై అమెరికాలో జరుగుతున్న దాడులు, కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే ఆమె ఆ పని చేసింది. ఆ టీ షర్ట్‌ మీద యాక్టివిస్ట్‌ అథ్లెట్‌ అని రాసి ఉంటుంది. పైగా బెర్రీకి ఇది కొత్తేం కాదు. ఇంతకు ముందు 2019లో పాన్‌ అమెరికన్‌ గేమ్స్‌ సందర్భంగా జాతీయ గీతం ప్రదర్శితమైన సందర్భంలో పిడికిలిని బిగించి తన ఉద్దేశ్యాన్ని చాటింది. ఆ టైంలో ఆమె చేష్టలతో స్పాన్సర్‌షిప్‌ కంపెనీలు దూరమయ్యాయి. 12 నెలల పాటు ఆమెపై వేటు పడింది. అయినా ఆమె జాతి వివక్ష వ్యతిరేక నిరసనలు ఆపనంటోంది బెర్రీ. తాజా పరిణామాల నేపథ్యంలో ‘నాతో ఆటలు ఆపండి’అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిందామె.

ఇక జాతి.. వర్ణ వివక్షలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం ఇలాంటి శాంతియుత ప్రదర్శనలకు అమెరికాలో అనుమతి ఉందని, అందుకే ఆమెపై ఎలాంటి చర్యలు ఉండబోవని యూఎస్‌ ఒలింపిక్‌ కమిటీ స్పష్టం చేసింది. దీంతో ఆమె ఒలింపిక్స్‌ ప్రయాణం సాఫీగా సాగనుంది. కానీ, టోక్యో ఒలింపిక్స్‌ వేదికపై మాత్రం ఇలాంటివి కుదరవు. రూల్‌ నెంబర్‌ 50 ప్రకారం.. ఎలాంటి నిరసనలకు అంతర్జాతీయ ఆటల పోటీల్లో చోటు లేదు.

చదవండి: ఎట్టకేలకు దిగొచ్చిన ఫేస్‌బుక్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు