T20 WC 2022: అక్తర్‌, బ్రాడ్‌ హాగ్‌లు దొరికేశారు కదా..!

25 Oct, 2022 20:55 IST|Sakshi

తెగ గొంతులు చించేసుకున్నారు. అది అనైతికం అంటూ ప్రకటనలు ఇచ్చేశారు.. అది విజయమే కాదనేశారు.. ఆ గెలుపును తక్కువ చేసే యత్నం చేశారు. వాళ్లే క్రికెట్‌ నిష్ణాతుల్లా బిల్డప్‌లు ఇచ్చేశారు. ఇదంతా ఓ ఇద్దరి మాజీ క్రికెటర్ల గురించి చెబుతున్న మాట.  క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు క్రికెట్‌ రూల్స్‌నే పక్క దారి పట్టించి అందర్నీ కన్ఫ్యూజ్‌ చేసిన బ్రాడ్‌ హాగ్‌, షోయబ్‌ అక్తర్‌లు గురించే ఇదంతా. ఇందులో ఒకరు ఆస్ట్రేలియా మాజీ అయితే, మరొకరు పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌. 

ఏదిబడితే అది మాట్లాడితే ఇలానే ఉంటుంది..
ఎవరికైనా మనదాకా వస్తేగానీ అసలు విషయం బోధపడదని సామెత ఉంది.  ఇది సరిపోతుంది ఈ ఇద్దరి మాజీ క్రికెటర్లకు. ఇది ఏ కాలం.. మనం ఎక్కడున్నాం..అనేది ముందు తెలుసుకోవాలి. సోషల్‌ మీడియా అంతగా లేని రోజుల్లో రుజువులు లేకపోతే అది గాల్లోకి కలిసిపోయేది. కానీ ఇప్పుడు అది కుదరదు. మనం మాట్లాడేముందు జాగ్రత్తగా ఉండాలంటారు. మనం సెలబ్రెటీ హోదాలో ఉండి ఏదో మాట్లాడేస్తే గతం బయటకొస్తుంది. ఇప్పుడు అలానే బయటకు తీశారు భారత్‌ క్రికెట్‌ అభిమానులు. ఇంకే ముందు బ్రాడ్‌ హాగ్‌, అక్తర్‌లను ఆడేసుకుంటున్నారు. ఎప్పుడో 2005లో జరిగిన ‘నో బాల్‌ బైస్‌ ఉదంతాన్ని’ మరొకసారి తెరపైకి తీసుకొచ్చి బ్రాడ్‌ హాగ్‌​, అక్తర్‌లకు ప్రశ్నలు సంధిస్తున్నారు.

గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో టీమిండియా తుది వరకూ పోరాడి పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్ఢుతమైన విజయానికి విరాట్‌ కోహ్లినే కారణం. కడవరకూ క్రీజ్‌లో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఇక్కడ ఫ్రీ హిట్‌లో బంతి బెయిల్స్‌కు తాకినా కోహ్లి-దినేశ్‌ కార్తీక్‌లు మూడు పరుగులు చేయడాన్ని అక్తర్‌, హాగ్‌లు తప్పుబట్టారు. ఇది డెడ్‌ బాల్‌ కదా అంటూ గళం విప్పారు. ఇది అంపైర్లు ఒత్తిడిలో ఉండే అలా చేశారంటూ బిల్డప్‌ ఇచ్చే పని చేశారు. 

17 ఏళ్ల క్రితం​ మ్యాచ్‌లోనే బెయిల్స్‌ పడినా..
కానీ ఎప్పుడో 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ మ్యాచ్‌లో ఫ్రీ హిట్‌లో బెయిల్స్‌ పడినా బైస్‌ రూపంలో వచ్చిన పరుగులకు సమస్య రాలేదు.  2005, జనవరి 13 వ తేదీన ఆస్ట్రేలియా-ఎ, పాకిస్తాన్‌ జట్ల మధ్య అడిలైడ్‌లో మ్యాచ్‌ జరిగింది. అది ట్వంటీ 20 మ్యాచ్‌. ఆ మ్యాచ్‌లో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేసే సమయంలో జేమ్స్‌ హోప్స్‌-బ్రాడ్‌ హాడిన్‌లు ఓపెనర్లగా దిగారు.

ఈ క్రమంలోనే అక్తర్‌ వేసిన ఓవర్‌లో ఒక బంతి నో బాల్‌ అయ్యింది. ఫలితంగా ఫ్రీ హిట్‌ వచ్చింది. ఆ బంతిని వికెట్ల వెనుకు వెళ్లి ఆడిన హాడిన్‌ మిడ్‌ వికెట్‌గా మీదుగా షాట్‌ ఆడాడు. దానికి రెండు పరుగులు వచ్చాయి. ఫ్రీహిట్‌గా వేసిన బంతి కూడా నో బాల్‌ కావడంతో బంతి కౌంట్‌ కాలేదు. మళ్లీ ఫ్రీ హిట్‌ వచ్చింది. ఆ బంతిని కూడా సేమ్‌ ఆలానే ఆడబోయాడు హాడిన్‌. కానీ అది బెయిల్స్‌ను గిరాటేసింది. అది ఫ్రీ హిట్‌ కావడంతో బతికిపోయిన హాడిన్‌ రెండు పరుగులు తీశాడు. మరి అప్పుడు అక్తర్‌ ఎటువంటి చప్పుడు చేయలేదు. నెక్స్ట్‌ బాల్‌ వేయడానికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. 

అది మ్యాచ్ ఆరంభం కాబట్టే అక్తర్ దాన్ని పట్టించుకోలేదా..మరొకవైపు అస్ట్రిలియా కాబట్టి ఆస్ట్రేలియన్లు ఎవరు నోరు విప్పే సాహసం చేయలేదా..అప్పుడు రూల్స్ లేవా బ్రాడ్ హాగ్, అక్తర్.. ఇదిగో ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది..మరి ఓ లుక్కేయండి

మరిన్ని వార్తలు