హఫీజ్‌ మెరుపులు..థ్రిల్లింగ్‌ విక్టరీ

3 Sep, 2020 08:34 IST|Sakshi

చివరి టి20లో ఇంగ్లండ్‌పై పాక్‌ గెలుపు

1-1తో సిరీస్‌ సమం

మాంచెస్టర్‌: టెస్టు సిరీస్‌ కోల్పోయి రెండో టి20లో పరాజయం పాలైన పాకిస్తాన్‌ ఎట్టకేలకు ఇంగ్లండ్‌ గడ్డపై ఒక విజయంతో తిరుగు ముఖం పట్టింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన చివరి టి20 మ్యాచ్‌లో పాక్‌ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ నెగ్గడంతో సిరీస్‌ 1–1తో సమంగా ముగిసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ మొహమ్మద్‌ హఫీజ్‌ (52 బంతుల్లో 86 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగి ఆడగా... హైదర్‌ అలీ (33 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అరంగేట్ర మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన తొలి పాకిస్తాన్‌ ఆటగాడిగా నిలిచాడు. (చదవండి: ‘మాది తండ్రీ కొడుకుల బంధం’)

అనంతరం ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడిపోయింది. మొయిన్‌ అలీ (33 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీకి తోడు టామ్‌ బాంటన్‌ (31 బంతుల్లో 46; 8 ఫోర్లు) రాణించాడు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సి ఉండగా... ఐదు బంతుల్లో 11 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి భారీ సిక్సర్‌ బాదిన టామ్‌ కరన్‌ చివరి బంతిని షాట్‌ ఆడటంలో విఫలమయ్యాడు. దాంతో పాక్‌ గెలుపు ఖాయమైంది. ఈ టూర్‌లో తొలి టెస్టులో గెలిచే స్థితి నుంచి ఓటమి పాలైన పాక్‌... తొలి టి20లో దాదాపు ఇంతే స్కోరు చేసి కూడా పరాజయాన్ని ఎదుర్కొంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ వేదికగా ‘బయో బబుల్‌’ సెక్యూర్‌ వాతావరణంలో వరుసగా రెండో విదేశీ జట్టు పర్యటన విజయవంతంగా ముగియడం విశేషం. (చదవండి: కొంత భయమైతే ఉంది: విలియమ్సన్‌ )

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా