Qatar Grand Prix 2021: హామిల్టన్‌కే ‘పోల్‌’ 

21 Nov, 2021 10:34 IST|Sakshi

దోహా: ఫార్ములావన్‌ సీజన్‌లో తొలిసారి జరుగుతున్న ఖతర్‌ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ పోల్‌ పొజిషన్‌తో మెరిశాడు. ప్రస్తుత సీజన్‌లో చివరిసారిగా హంగేరి గ్రాండ్‌ప్రిలో పోల్‌ను సొంతం చేసుకున్న హామిల్టన్‌... మళ్లీ ఎనిమిది గ్రాండ్‌ప్రిల తర్వాత ఆ ఘనతను అందుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌ చివరి రౌండ్‌లో అతడు ల్యాప్‌ను అందరికంటే ముందుగా ఒక నిమిషం 20.827 సెకన్లలో పూర్తి చేసి పోల్‌ను అందుకున్నాడు. సీజన్‌లో హామిల్టన్‌కిది నాలుగో పోల్‌కాగా... ఓవరాల్‌గా 102వది. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్‌ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ రెండో స్థానం నుంచి మొదలుపెడతాడు. మెర్సిడెస్‌ డ్రైవర్‌ బొటాస్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నేటి ప్రధాన రేసును రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌ హెచ్‌డి–2, హాట్‌స్టార్‌లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.

‘బ్లిట్జ్‌’ విభాగంలోనూ అర్జున్‌ జోరు...
టాటా స్టీల్‌ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం), తెలంగాణ ప్లేయర్‌ ఎరిగైసి అర్జున్‌ శనివారం మొదలైన ‘బ్లిట్జ్‌’ టోర్నమెంట్‌లోనూ ఆకట్టుకున్నాడు. 18 రౌండ్లపాటు జరుగుతున్న బ్లిట్జ్‌ టోర్నీలో తొలి రోజు 9 రౌండ్లు ముగిశాయి. తొమ్మిదో రౌండ్‌ తర్వాత 18 ఏళ్ల అర్జున్‌ 6.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. సామ్‌ షాంక్‌లాండ్‌ (అమెరికా), గుకేశ్‌ (భారత్‌), విదిత్‌ (భారత్‌), ద్రోణవల్లి హారిక (భారత్‌)లపై గెలిచిన అర్జున్‌... నిహాల్‌ సరీన్‌ (భారత్‌), çమగ్సూద్లూ (ఇరాన్‌), రౌనక్‌ సాధ్వాని (భారత్‌), లెవాన్‌ అరోనియన్‌ (అర్మేనియా), క్వాంగ్‌ లీమ్‌ (వియత్నాం)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. నేడు మరో తొమ్మిది రౌండ్లు జరుగుతాయి. 

మరిన్ని వార్తలు