-

టీ20 బ్లాస్ట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో హైడ్రామా.. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఇలా..!

17 Jul, 2022 12:23 IST|Sakshi

T20 Blast 2022 Final: బర్మింగ్‌హామ్‌ వేదికగా శనివారం జరిగిన టీ20 బ్లాస్ట్ 2022 ఫైనల్‌ మ్యాచ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. లాంకాషైర్‌, హాంప్‌షైర్‌ జట్ల మధ్య శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్‌ ఆఖరి బంతికి విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సిన క్రమంలో లాంకాషైర్‌ ఆటగాడు రిచర్డ్‌ గ్లీసన్‌ను నాథన్‌ ఎల్లీస్‌ అద్భుతమైన యార్కర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో హాంప్‌షైర్‌ విజయం ఖరారైంది. దీంతో హాంప్‌షైర్‌ ఆటగాళ్లు గెలుపు సంబురాల్లో మునిగిపోయారు. అయితే అప్పుడే హాంప్‌షైర్‌ ఆటగాళ్లకు గుండె పగిలే వార్త చెప్పాడు ఫీల్డ్‌ అంపైర్‌. 

ఎల్లీస్‌ వేసిన ఆఖరి బంతిని అతను నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో గ్రౌండ్‌లో ఒక్కసారిగా నిశబ్ద వాతావరణం నెలకొంది. ఆఖరి బంతి నో బాల్‌ (ఫ్రీ హిట్‌తో పాటు అదనపు పరుగు) కావడంతో సమీకరణలు మారిపోయాయి. లాంకాషైర్‌ చివరి బంతికి 3 పరుగులు చేస్తే చేజారిందనుకున్న విజయం తిరిగి వరిస్తుంది. ఈ పరిస్థితుల్లో బంతిని అందుకున్న ఎల్లీస్‌ చాకచక్యంగా స్లో బాల్‌ వేయడంతో బైస్‌ రూపంలో కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. 

దీంతో హాంప్‌షైర్‌ ఆటగాళ్లు మరోసారి సంబురాలు షురూ చేశారు. ఈసారి వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ జట్టు అభిమానులు బాణసంచా పేలుస్తూ గ్రౌండ్‌లో హంగామా సృష్టించారు. ఆఖరి బంతికి నెలకొన్న హైడ్రామాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. పొట్టి క్రికెట్‌ చరిత్రలో ఇలాంటి మ్యాచ్‌ ఎన్నడూ చూడలేదని, టీ20ల్లో ఇలా జరగడం బహుశా ఇదే మొదటిసారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

స్కోర్‌ వివరాలు..
హాంప్‌షైర్‌: 152/8 (20)
లాంకాషైర్: 151/8 (20)
ఫలితం: ఒక్క పరుగు తేడాతో హాంప్‌షైర్‌ విజయం
చదవండి: చెలరేగిన షాహిన్‌ అఫ్రిది.. కుప్పకూలిన శ్రీలంక

మరిన్ని వార్తలు