విహారి పోరాటం అదిరింది.. ఆసీస్‌ అలసింది

11 Jan, 2021 13:58 IST|Sakshi

విహారి 161 బంతుల్లో 23 పరుగులు

డ్రాగా ముగిసిన మూడో టెస్టు

ఆకట్టుకున్న అశ్విన్‌

సిడ్నీ: టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు వరకూ ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠలో చివరకు భారత్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. హనుమ విహారి స్లో ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ ఆసీస్‌ చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకుంది. ద్రవిడ్‌ పుట్టినరోజు(జనవరి 11వ తేదీన) విహారి మరొకసారి ‘ ది వాల్‌’ను గుర్తుచేస్తూ ఆసీస్‌కు ముచ్చెమటలు పట్టించాడు. విహారిని ఔట్‌ చేస్తే మ్యాచ్‌ను తనవైపుకు మళ్లుతుందనుకున్న ఆసీస్‌కు విసుగుతెప్పించీ మరీ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక్కడ విహారి తన సుదీర్ఘ పోరాటంతో అదరగొడితే.. ఆసీస్‌ మాత్రం చివరకు అలసిపోయి డ్రాతో సరిపెట్టుకుంది. 407 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించి టీమిండియా.. ఐదు వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ఆటకు సమయం ముగియడంతో మ్యాచ్‌ డ్రాగా ముగియక తప్పలేదు. 

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 161 బంతులు ఆడిన విహారి 4 ఫోర్ల సాయంతో 23 పరుగులే చేశాడు. ఫలితంగా భారత్‌ తరఫున స్లోయస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడిన జాబితాలో చోటు సంపాదించాడు.  గతంలో యశ్‌పాల్‌ శర్మ ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 157 బంతులు ఆడి 13 పరుగులే చేశాడు. 1981లో యశ్‌పాల్‌ శర్మ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.  ఇక్కడ యశ్‌పాల్‌ స్టైక్‌రేట్‌ 8.28గా ఉంది. ఇక రాహుల్‌ ద్రవిడ్‌ 96 బంతులాడి12 పరుగులు చేశాడు. 2007లో ఇంగ్లండ్‌పై ద ఓవల్‌ వేదికగా జరిగిన టెస్టులో ద్రవిడ్‌ దీన్ని నమోదు చేశాడు. ఈ పరుగులుచేసే క్రమంలో ద్రవిడ్‌ స్టైక్‌రేట్‌ 12.50గా ఉంది. ఇక్కడ స్టైక్‌రేట్‌ పరంగా వీరిద్దరి కంటే విహారి కాస్త ముందంజలో ఉన్నాడు. ఆసీస్‌తో రెండో ఇన్నింగ్స్‌లో విహారి నమోదు చేసిన స్టైక్‌రేట్‌ 14.29గా నమోదైంది.  కాగా,  సెంచరీ బంతులు దాటిన తర్వాతే విహారి స్టైక్‌రేట్‌ పెరిగింది. 112 బంతులకు  విహారి 7 పరుగులే చేసి ఆసీస్‌కు కఠినమైన పరీక్ష పెట్టాడు. ఆ సమయంలో విహారి స్టైక్‌రేట్‌ 6.25గా ఉంది. (స్టీవ్‌ స్మిత్‌..  మళ్లీ చీటింగ్‌ చేశాడు..!)

పంత్‌ దూకుడు.. 
98/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా రహానే ఎంతసేపో క్రీజ్‌లో నిలవలేదు. రహానే 18 బంతుల్లో 4 పరుగులు చేసి మూడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో బ్యాటింగ్‌కు దిగిన పంత్‌.. దూకుడుగా ఆడాడు. రెండు లైఫ్‌లతో బయటపడ్డ పంత్‌ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీ చేసుకున్న పంత్‌.. సెంచరీకి అతి దగ్గరగా వచ్చి పెవిలియన్‌ చేరాడు.   రిషభ్‌ పంత్‌ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా సొగసైన ఇన్నింగ్స్‌ ఆడిన పంత్‌.. మూడు పరుగుల వ్యవధిలో శతకం చేసే చాన్స్‌ను కోల్పోయాడు.  ఇక పుజారా 205 బంతుల్లో 12 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. ఇక విహారి జతగా ఔట్‌ కాకుండా అజేయంగా నిలిచిన అశ్విన్‌ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. 

పుజారా-రిషభ్‌ రికార్డు బ్యాటింగ్‌
పుజారా-రిషభ్‌లు నాల్గో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ జోడి నాల్గో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో టీమిండియా తిరిగి తేరుకుంది. అదే సమయంలో నాల్గో ఇన్నింగ్స్‌లో నాల్గో వికెట్‌కు భారత్‌ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన జోడిగా పుజారా-పంత్‌లు నిలిచారు. గతంలో ఈ రికార్డు రుసి మోడీ-విజయ్‌ హజారేల పేరిట ఉండేది. వీరు నాల్గో ఇన్నింగ్స్‌ నాల్గో వికెట్‌కు 139 పరుగుల్ని సాధించగా, దాన్ని పంత్‌-పుజారాల జోడి బ్రేక్‌ చేసింది. ప్రస్తుతం టెస్టు సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో ఆసీస్‌ గెలవగా, రెండో టెస్టులో టీమిండియా గెలిచింది. మూడో టెస్టు డ్రాగా ముగియడంతో నాల్గో టెస్టుపై ఆసక్తి పెరిగింది. జనవరి 15వ తేదీ నుంచి బ్రిస్బేన్‌ వేదికగా సిరీస్‌లో చివరిదైన నాల్గో టెస్టు  జరుగనుంది. 

మరిన్ని వార్తలు