ప్రేమోన్మాది చేతిలో గాయపడిన అమ్మాయికి హనమ విహరి ఆర్ధిక సాయం

8 Jun, 2021 15:08 IST|Sakshi

లండన్: టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌ హనుమ విహారి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా కాలంలో తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు సాయం చేస్తున్న విహారి.. తాజాగా ప్రేమోన్మాది చేతిలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ అమ్మాయిని కాపాడాడు. సరైన సమయంలో వైద్యానికి అవసరమైన డబ్బును అందించడంతో ప్రియాంక అనే ఆ అమ్మాయి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి కోలుకుంటుంది.

వివారాల్లోకి వెళితే... శ్రీకాంత్ అనే అబ్బాయి ప్రేమ పేరుతో బాధితురాలు ప్రియాంకను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓ రోజు ప్రియాంకకు ప్రపోస్ చేయగా.. ఆమె నిరాకరించింది. దీంతో ఆవేశానికి లోనైన శ్రీకాంత్.. కత్తితో ప్రియాంకపై దాడి చేసి, ఆమె గొంతు కోశాడు. ఘటనా స్థలంలో నిర్జీవంగా పడివున్న ప్రియాంకను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆపరేషన్ కోసం 6 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. అంత మొత్తంలో డబ్బులు చెల్లించుకోలేని ప్రియాంక కుటుంబసభ్యులు సోషల్ మీడియా ద్వారా దాతలను అభ్యర్ధించారు.

ఈ విషయం తెలుసుకున్న హనుమ విహారి.. వెంటనే స్పందించి ఆ అమ్మయి వైద్యానికి అవసరమయ్యే 5 లక్షలు పంపాడు. ఆపరేషన్ తర్వాత ప్రియాంక ప్రస్తుతం కోలుకుంటోంది. విహారి చేసిన సహాయానికి ప్రియాంక, ఆమె కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విహారి అక్కడి నుంచే భారతీయుల అవస్థలపై కంట కనిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 100 మంది వలంటీర్లతో విహారి ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు.

ఈ బృందంలో విహారి భార్య ప్రీతి, సోదరి వైష్ణవి, ఆంధ్ర రంజీ సహచరులు కూడా ఉన్నారు. వీరందరూ పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, 27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. అశ్విన్‌తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును గట్టెక్కించి విషయం తెలిసిందే. 
చదవండి: ఆసీస్‌ వికెట్‌ కీపర్‌కు తీవ్ర గాయాలు.. పెదాలపై ఏడు కుట్లు
 

మరిన్ని వార్తలు