‘మ్యాట్‌’పై విహారి సాధన... 

11 Sep, 2020 08:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారత ఆటగాళ్లు, పలువురు దేశవాళీ క్రికెటర్లు ఐపీఎల్‌ 2020 కోసం యూఏఈలో సన్నద్ధమవుతుండగా... తెలుగు కుర్రాడు, టెస్టు జట్టు సభ్యుడు హనుమ విహారి ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటన కోసం భిన్నమైన కసరత్తులు చేస్తున్నాడు. బోర్డు కాంట్రాక్టు ప్లేయర్‌ అయిన విహారి క్లిష్టమైన కంగారు పర్యటన కోసం బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు.

‘ఐపీఎల్‌లో అవకాశం దక్కి ఉంటే బావుండేది. అయితే ఆడే చాన్స్‌ లేకపోవడంపై ఎక్కువగా ఆలోచించడం లేదు. ఇప్పుడు నేను ప్రాక్టీస్‌పైనే దృష్టి సారించాను. కోచ్‌ శ్రీధర్‌ సార్‌ ఆధ్వర్యంలో నా సాధన కొనసాగుతోంది’ అని విహారి అన్నాడు. లాక్‌డౌన్‌ వల్ల బయటికి వెళ్లి ప్రాక్టీస్‌ చేసే అవకాశం లేకపోవడంతో తన ఇంటి పరిసరాల్లోనే మ్యాటింగ్‌ వికెట్‌పై ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. నెట్‌ సెషన్‌ కోసం కోచ్‌ సలహా మేరకు ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాడు.

ఆసీస్‌లోని బౌన్సీ వికెట్‌లపై ఆడేందుకు ఈ విధమైన మ్యాటింగ్‌ వికెట్‌ ప్రాక్టీస్‌ దోహదం చేస్తుందని విహారి తెలిపాడు. భారత దిగ్గజాలుగా ఎదిగిన అజహరుద్దీన్, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు కూడా ఇలాంటి మ్యాట్‌ పిచ్‌లపైనే ప్రాక్టీసే చేశారు. ఐపీఎల్‌లో ఆడని భారత క్రికెటర్ల సన్నాహాల్ని ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ పర్యవేక్షిస్తున్నారు. నిజానికి విహారి ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ వల్ల అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో అక్కడికి వెళ్లలేకపోయాడు.

మరిన్ని వార్తలు