Sanju Samson Birthday Special: ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో!

11 Nov, 2022 16:52 IST|Sakshi

ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. కానీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. టీమిండియా సీనియర్‌ జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారిపోయింది. ఒకవేళ దక్కినా అది చిన్న జట్లతో ఆడేటప్పుడు మాత్రమే. అయినా ఏం బాధపడలేదు. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటున్నాడు. అతనే వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌. టి20 ప్రపంచకప్‌ 2022లో టీమిండియా వైఫల్యం అనంతరం ఇప్పుడు సంజూ శాంసన్‌ లాంటి క్రికెట్‌ర్లు టీమిండియాకు అత్యవసరం. కాగా ఇవాళ(నవంబర్‌ 11న) సంజూ శాంసన్‌ పుట్టిన రోజు.

తాజాగా టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లో వెనుదిరగడంతో విమర్శలతో పాటు ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఐపీఎల్‌కు మాత్రమే పనికొచ్చే కేఎల్‌ రాహుల్‌ స్థానంలో సంజూ శాంసన్‌ లాంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చినా బాగుండు అని అభిమానులు పేర్కొన్నారు. ఇవాళ ఐపీఎల్‌ను బ్యాన్‌ చేయాలి అని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అదే ఐపీఎల్‌ నుంచి వెలుగులోకి వచ్చినవారిలో సంజూ శాంసన్‌ కూడా ఉన్నాడు.

ఐసీసీ టోర్నీ కోసం భారత జట్టు ప్రకటించిన ప్రతిసారి.. సంజూ గురించే నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకునేవారు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ సెమీస్ లో ఓడిపోవడంతో మనోడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. అయితే టీమిండియాలో ఉన్న రాజకీయాలు కూడా సంజూకు అవకాశాలు సరిగ్గా రాకపోవడానికి ఒక కారణమయ్యాయి.  

ఇక ఢిల్లీలో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన సంజూ.. తన ఆటను డెవలప్ చేసుకునేందుకు సొంత రాష్ట్రం కేరళకు వెళ్లిపోయాడు. 17 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అంటే 2012లో అద్భుతమైన బ్యాటింగ్ తో అండర్-19 ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. దేశవాళీలో అదిరిపోయే బ్యాటింగ్ తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా 2015లో జింబాబ్వే జట్టుపై టీ20 అరంగేట్రం చేశాడు. కానీ జట్టులో పర్మినెంట్ ప్లేస్ దక్కించుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా శాంసన్‌ది అదే పరిస్థితి.

అయితే ఈ మధ్య కాలంలో సంజూ శాంసన్‌ నిలకడగా రాణిస్తున్నాడు. అందుకు ఉదాహరణ ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్‌తో సిరీస్‌. ఈ సిరీస్‌లో రెండో టి20 మ్యాచ్‌లో శాంసన్‌ 42 బంతుల్లోనే 77 పరుగులు చేసి తొలి టి20 హాఫ్‌ సెంచరీ సాధించాడు. అంతేకాదు అదే మ్యాచ్‌లో దీపక్‌ హుడాతో కలిసి రెండో వికెట్‌కు 176 పరుగులు జోడించాడు. టీమిండియా తరపున టి20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఇదే మ్యాచ్‌లో దీపక్‌ హుడా సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు ఎంపికయినప్పటికి తుది జట్టలో చోటు దక్కలేదు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడాడు. అక్కడ తొలి వన్డే హాఫ్‌ సెంచరీ సాధించడమే గాక శ్రేయాస్‌ అయ్యర్‌తో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ స్థానంలో వచ్చిన శాంసన్‌ అప్పుడు కూడా బ్యాట్‌తో మెరిశాడు. దీని తర్వాత జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో భాగంగా శాంసన్‌ రెండో వన్డేలో 43 పరుగులు నాటౌట్‌గా నిలవడంతో కీపర్‌ మూడ క్యాచ్‌లు అందుకొని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో 86 పరుగులతో నాటౌట్‌ నిలిచి సత్తా చాటాడు.

అలా తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న సంజూ శాంసన్‌కు టి20 ప్రపచంకప్‌లో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ మళ్లీ అవే రాజకీయాల కారణంగా సంజూకు చోటు దక్కలేదు. దీంతో అభిమానులు బీసీసీఐపై గరమయ్యారు. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని కనీసం స్టాండ్‌ బై ప్లేయర్‌గానైనా ఎంపిక చేస్తే బాగుండేదని.. కనీసం ఆ అర్హత కూడా శాంసన్‌కు లేదా అంటూ ఫ్యాన్స్‌ బీసీసీఐకి చురకలంటిచారు.

ఇక ఐపీఎల్‌లో ఎక్కువగా రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్‌ 138 మ్యాచ్‌ల్లో 3526 పరుగులు చేశాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఇదంతా పక్కనబెడితే.. నవంబరు 11న తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్స్.. అతడికి శుభాకాంక్షలు చెప్పారు. ఇకపై అయినా సంజూ శాంసన్‌ ప్రతిభను గుర్తించి టీమిండియాలో విరివిగా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి Happy Birthday Sanju Samson..

చదవండి: 'ఒక్కడిని ఏం చేయగలను.. ఓటమి బాగా హర్ట్‌ చేసింది'

మరిన్ని వార్తలు