Zaheer Khan Birthday Special: 'దేశంలో చాలా మంది ఇంజనీర్లున్నారు.. నువ్వు ఫాస్ట్‌ బౌలర్‌ అవ్వు'

8 Oct, 2022 11:40 IST|Sakshi

టీమిండియాలోకి చాలా మంది ఫాస్ట్‌ బౌలర్లు వచ్చి వెళ్లారు. కొందరు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటే.. కొంతమంది మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. క్రికెట్‌ను అమితంగా అభిమానించే మన దేశంలో టాప్‌ క్లాస్‌ బౌలర్లుగా వెలుగొందిన వారిలో స్పిన్నర్లే ఎక్కువ. స్పిన్నర్లు ఎంత ప్రభావం చూపించినప్పటికి ఒక తరానికి ఒక్కో ఫాస్ట్‌ బౌలర్‌ భారత్‌ పేస్‌ దళాన్ని నడిపించారు.

1970,80వ దశకంలో కపిల్‌ దేవ్‌ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్‌.. ఇక 90వ దశకంలో జగవల్‌ శ్రీనాథ్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌ లాంటి పేసర్లు టీమిండియాను నడిపించారు. ఇక మిలీనియం ఆరంభంలో టీమిండియాలోకి కొత్త బౌలర్‌ వచ్చాడు. మొదట్లో పెద్దగా రాణించకపోయినప్పటికి గంగూలీ అండతో వరుసగా అవకాశాలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దాదాపు దశాబ్దంన్నర కాలం పాటు టీమిండియా బౌలింగ్‌లో పెద్దన్న పాత్ర పోషించాడు. అతనే టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌.

క్రికెట్‌పై ఉన్న అభిరుచి అతన్ని ఇంజనీర్‌ నుంచి క్రికెటర్‌గా మార్చింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మాజీ లెఫ్టార్మ్ పేసర్, ఎంఎస్‌ ధోనీ నేతృత్వంలోని జట్టు 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. యువతకు రోల్ మోడల్, ఫాస్ట్ బౌలర్ 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో తనదైన ముద్ర వేశాడు. భారత అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్. ఇవాళ(అక్టోబర్ 8న) తన 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 

ఇంజనీర్‌ నుంచి క్రికెటర్‌గా..
జహీర్ ఖాన్ క్రికెటర్ గా మారిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జహీర్ 1978 అక్టోబర్ 8న మహారాష్ట్రలోని శ్రీరాంపూర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. మహారాష్ట్రలోని ఒక చిన్న పట్టణానికి చెందిన అతను టీమిండియాలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. తన ప్రారంభ విద్యను శ్రీరాంపూర్‌లోని హింద్ సేవా మండల్ న్యూ మరాఠీ ప్రాథమిక పాఠశాలలో.. ఆ తర్వాత కేజే సోమయ్య సెకండరీ పాఠశాలలో చదివాడు.

తదనంతరం జహీర్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. జహీర్‌కు క్రికెట్‌పై ఉన్న మక్కువ చూసి అతని తండ్రి ఫాస్ట్ బౌలర్‌గా మారమని సలహా ఇచ్చాడు. ''దేశంలో చాలా మంది ఇంజనీర్లు ఉన్నారు.. నువ్వు ఫాస్ట్ బౌలర్‌గా తయారయ్యి టీమిండియాకు సేవలందించు అని జహీర్‌ తండ్రి పేర్కొన్నాడు. తండ్రి మాటలను ఆదర్శంగా తీసుకున్న జహీర్ తర్వాత వెనుదిరిగి చూడలేదు.

జహీర్ 'జకాస్' అయ్యాడు..
జహీర్ ఖాన్‌ను క్రికెటర్‌గా తయారు చేయాలనే ఉద్దేశంతో అతని తండ్రి ముంబైకి తీసుకొచ్చాడు. ఇక్కడే జహీర్ ఖాన్ 'జాక్' పేరుతో క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. జింఖానా క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో జహీర్ ఏడు వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు. ఇక్కడే జహీర్‌ ఖాన్‌ MRF పేస్ ఫౌండేషన్‌కు చెందిన టీఏ శేఖర్ దృష్టిలో పడ్డాడు. తన వెంట జహీర్‌ను చెన్నైకి తీసుకెళ్లాడు. జహీర్ ఫస్ట్ క్లాస్, ఆపై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టగలిగాడు.

2011 ప్రపంచ కప్ హీరోగా..
అలాగే, 28 ఏళ్ల తర్వాత భారత జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలవడానికి జహీర్ ఖాన్ కూడా ప్రధాన కారణం. 2011 ప్రపంచకప్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో జహీర్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రపంచకప్‌లో 21 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలో జహీర్ పేరిట మొత్తం 44 వికెట్లు నమోదయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో జహీర్ 610 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 311 వికెట్లు..వన్డేల్లో 282 వికెట్లు పడగొట్టిన జహీర్‌ 17 టి20లు ఆడి 17 వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు