తను బౌలిం‍గ్‌ చేస్తుంటే మేటి బ్యాటర్లు సైతం వణికిపోయేవారు.. మేము కూడా: భారత మాజీ క్రికెటర్‌

8 Sep, 2023 15:42 IST|Sakshi

Aakash Chopra pays tribute to Heath Streak: జింబాబ్వే క్రికెట్‌ దిగ్గజం, దివంగత హీత్‌ స్ట్రీక్‌పై టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. స్ట్రీక్‌ బౌలింగ్‌ చేస్తుంటే మేటి బ్యాటర్లు సైతం వణికిపోయేవారని గుర్తుచేసుకున్నాడు. జింబాబ్వేకు దొరికిన క్రికెట్‌ ఆణిముత్యం ఇక లేడనే నిజాన్ని జీర్ణించుకోక తప్పదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

కాగా ఆల్‌రౌండర్‌ హీత్‌ స్ట్రీక్‌ మరణించాడంటూ కొన్ని రోజుల క్రితం నకిలీ వార్త చక్కర్లు కొట్టిన విషయం విదితమే. స్ట్రీక్‌ సహచర క్రికెటర్‌ ఒలంగో చేసిన ట్వీట్‌ గందరగోళానికి దారితీయడంతో.. తాను బతికే ఉన్నానంటూ స్వయంగా అతడు మీడియాకు వెల్లడించాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

49 ఏళ్ల వయసులోనే లోకాన్ని వీడాడు
కానీ.. రోజుల వ్యవధిలోనే హీత్‌ స్ట్రీక్‌ తుదిశ్వాస విడిచిన విషయాన్ని అతడి భార్య బయటపెట్టడంతో మళ్లీ కన్నీటిసంద్రంలో మునిగిపోయారు. తన బౌలింగ్‌ నైపుణ్యాలతో దిగ్గజ బ్యాటర్లను హడలెత్తించిన ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ క్యాన్సర్‌తో పోరాడి ఓడి.. 49 ఏళ్ల వయసులోనే కన్నుమూయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

నిజంగానే లెజెండ్‌
ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా.. హీత్‌ స్ట్రీక్‌కు నివాళి అర్పిస్తూ.. ‘‘హీత్‌ స్ట్రీక్‌ ఇకలేడు. గతంలో ఓసారి ఇలాంటి వార్త నకిలీదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఈసారి నిజంగానే తను లేడు. గొప్ప ఆటగాడు. ఏమాత్రం సందేహం లేకుండా.. అతడిని మనం జింబాబ్వే లెజెండ్‌ అని పిలవవచ్చు. ఈ మాట నేను అంటున్నది కాదు.. అతడు నిజంగానే ఓ దిగ్గజం. జింబాబ్వే క్రికెట్‌కు దొరికిన అత్యంత గొప్ప క్రికెటర్లతో ఒకడు.

మేటి బ్యాటర్లను సైతం హడలెత్తించాడు
బౌలింగ్‌లో తనకు తానే సాటి. హరారేలో అతడు బౌలింగ్‌ చేస్తున్నాడంటే హడలెత్తిపోని బ్యాటర్‌ ఉండరంటే అతిశయోక్తి కాదు. మేము జింబాబ్వే పర్యటనకు వెళ్లినపుడు ఇలాంటి పరిస్థితే ఉండేది. కేవలం బౌలింగ్‌ మాత్రమే కాదు.. హీత్‌ స్ట్రీక్‌ బ్యాటింగ్‌ కూడా గొప్పగా ఉండేది. అందుకే అభిమానులతో పాటు అతడి సమకాలీన క్రికెటర్లు కూడా ఆరాధ్యభావంతో చూసేవారు. కానీ ఇలా చిన్న వయసులోనే స్ట్రీక్‌ వెళ్లిపోవడం బాధాకరం.

ఓడిపోయాడు.. మై ఫ్రెండ్‌ రెస్ట్‌ ఇన్‌ పీస్‌
క్యాన్సర్‌తో పోరులో అతడు ఓడిపోవడం నిజంగా దురదృష్టకరం. మై ఫ్రెండ్‌.. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలి హీత్‌. నీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ అని విచారం వ్యక్తం చేశాడు.

పదమూడేళ్లపాటు దిగ్విజయంగా
కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో 1993- 2005 మధ్య పదమూడేళ్ల పాటు జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్‌లో మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌.. 89 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు. 

టీమిండియాను ఓడించి
టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 455 వికెట్లు కూల్చి ఈనాటికీ జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. పలు మ్యాచ్‌లలో లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసిన హీత్‌ స్ట్రీక్‌ 4 వేల పరుగులు చేయడం విశేషం.

ఇక 2001లో స్ట్రీక్‌ కెప్టెన్సీలో జింబాబ్వే.. టీమిండియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించడం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా సెప్టెంబరు 3న హీత్‌ స్ట్రీక్‌ కన్నుమూసిన విషయం విదితమే.

చదవండి: సచిన్‌ కంటే ఇంజమామ్‌ గొప్ప.. కోహ్లి కంటే బాబర్‌ బెటర్‌.. ఏంటిది? చెత్తగా..

మరిన్ని వార్తలు