Harbhajan Singh Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌

24 Dec, 2021 15:05 IST|Sakshi

అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన భారత మేటి స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌

23 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో ఘనతలు

 18 ఏళ్లపాటు భారత్‌కు ప్రాతినిధ్యం

2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన టీమిండియాలో సభ్యుడు

Harbhajan Singh Announces Retirement: వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తన క్రికెట్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. శుక్రవారం అన్ని రకాల ఫార్మాట్లకు అతను రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌ కలిపి 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో భజ్జీ బంతులు వికెట్లను పడగొట్టడమే కాదు... మ్యాచ్‌లనూ మలుపు తిప్పాయి. 1998లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 41 ఏళ్ల ఈ పంజాబీ స్టార్‌ సంప్రదాయ ఫార్మాట్‌లో 103 టెస్టులు ఆడి 417 వికెట్లు పడగొట్టాడు. 2 సెంచరీ లతో కలిపి 2,224 పరుగులు కూడా చేశాడు. ఇటు 236 వన్డేల్లో 269 వికెట్లను చేజిక్కించుకొని 1,237 పరుగులు సాధించాడు. 28 టి20 మ్యాచ్‌ల్లో 25 వికెట్లను తీశాడు.

‘మంచి విషయాలకు ముగింపు ఉంటుంది. నా జీవితంలో భాగమైన క్రికెట్‌కు, నాపై ఎంతగానో ప్రభావం చూపిన ఆటకు నేను గుడ్‌బై చెబుతున్నాను. నా 23 ఏళ్ల చిరస్మరణీయ కెరీర్‌కు అండదండలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు’ అని హర్భజన్‌ తన రిటైర్మెంట్‌ సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. అందరి క్రికెటర్లలాగే నేను కూడా భారత జెర్సీతోనే ఆటకు వీడ్కోలు పలకాలని ఆశించాను. కానీ విధి నాతో మరోలా చేయించింది’ అని తెలిపాడు. 2016లో ఢాకాలో యూఏఈతో చివరిసారిగా అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ ఆడిన భజ్జీ మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకోలేదు. ఈ ఏడాది భారత్‌లో జరిగిన తొలి అంచె ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు. కానీ రెండో అంచె ఐపీఎల్‌ కోసం వేదిక యూఏఈకి మారాక హర్భజన్‌ బరిలోకి దిగలేదు. 


చదవండి: భారత్‌లో బెట్టింగ్‌.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు