IND vs ZIM: గిల్‌ అద్భుతమైన ఆటగాడు.. భావి భారత కెప్టెన్‌ అతడే: హర్భజన్

23 Aug, 2022 15:33 IST|Sakshi

టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్నాడు. గత నెలలో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన గిల్‌.. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ సత్తా చాటాడు. సోమవారం జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో గిల్‌ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తద్వారా తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు.

ఈ క్రమం‍లో సెంచరీతో చేలరేగిన గిల్‌పై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌ గిల్‌ అని అతడు కొనియాడాడు. అదే విధంగా విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ వంటి స్టార్‌ ఆటగాళ్ల శైలిలో గిల్‌ ఆడుతున్నాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు.

గిల్‌ భావి భారత కెప్టెన్‌
"గిల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు బ్యాటింగ్‌ టెక్నిక్‌ గానీ షాట్‌ సెలక్షన్‌ గానీ అద్భుతంగా ఉంటాయి. గిల్‌ను బ్యాటింగ్‌ శైలీ పరంగా ప్రస్తుతం భారత జట్టులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రాహుల్‌ వంటి కీలక ఆటగాళ్లతో పోల్చవచ్చు. నాకైతే అతడు భావి భారత కెప్టెన్‌ అవుతాడని అనిపిస్తోంది. అతడికి కెప్టెన్‌గా అనుభవం లేనప్పటకీ రాబోయే రోజుల్లో అతడు నేర్చుకోనే అవకాశం ఉంది" అని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్  పేర్కొన్నాడు.

సచిన్‌ రికార్డు బద్దలు!
జింబాబ్వేతో మూడో వన్డేలో 130 పరుగులు సాధించిన గిల్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. అంతకుమందు ఈ రికార్డు  టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్‌ అజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో సచిన్‌ 24 ఏళ్ల రికార్డును గిల్‌ అధిగమించాడు.

మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌, సిరీస్‌ సొంతం!
ఇక మూడో వన్డేతో పాటు ఓవరాల్‌ సిరీస్‌లో అదరగొట్టిన గిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు సిరీస్‌ అవార్డులు వరించాయి. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 245 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, అర్ధశతకం ఉన్నాయి. కాగా  ఇప్పటి వరకు భారత్‌ తరపున 9 వన్డేలు ఆడిన గిల్‌ 499 పరుగులు సాధించాడు. వన్డేల్లోఅతడి వ్యక్తిగత స్కోర్‌ 130 పరుగులు.

చదవండి: ICC ODI Rankings: క్లీన్‌స్వీప్‌లు.. టీమిండియా, పాకిస్తాన్‌ ఏ స్థానాల్లో ఉన్నాయంటే!

మరిన్ని వార్తలు