Viral: సిగ్గు పడాలి.. ఇలాగేనా పోరాడేది: భజ్జీ

25 May, 2021 13:05 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడంతో పాటుగా వందలాది మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అక్కడ 25 వేలకు పైగా మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 529 మంది కోవిడ్‌తో మరణించారు. అయితే, రాజధాని బెంగళూరులో తొలుత భారీ ఎత్తున కేసులు నమోదు కాగా, లాక్‌డౌన్‌ విధించిన అనంతరం నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం అక్కడ 5701 కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా.. బెంగళూరులో ఓ వ్యక్తికి బలవంతంగా కోవిడ్‌ టెస్టు చేయిస్తున్న దృశ్యాలు అంటూ శిల్పా కన్నన్‌ నెటిజన్‌ షేర్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ యువకుడిని బలవంతంగా లాక్కొచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిని పరీక్ష చేయించుకోవాలంటూ తీవ్రంగా కొట్టారు. ఇష్టారీతిన కొడుతూ చేతులు విరుస్తూ అమానుషంగా ప్రవర్తించారు. బాటసారులు ఆపేందుకు ప్రయత్నించినా అస్సలు వెనక్కి తగ్గలేదు. 

ఇక ఈ వీడియోపై స్పందించిన టీమిండియా వెటరన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌.. ‘‘సిగ్గు పడండి. టెస్టు చేయించుకోమని ఎందుకు అతడిని అలా కొడుతున్నారు? ఇలాగేనా మనం వైరస్‌పై పోరాడేది. చాలా తప్పు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, ఓ నెటిజన్‌ మాత్రం.. ‘‘అతడికి గతంలో పాజిటివ్‌ వచ్చింది. అయినప్పటికీ బయట తిరుగుతున్నాడు. అతడిపై ఫిర్యాదు చేసిన వారిపై ఉమ్మివేశాడు. అందుకే ఇలా మరోసారి టెస్టుకు తీసుకువచ్చారు. మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. మనం చూసేదంతా సరైందని అనుకోవద్దు’’ అని వివరణ ఇచ్చాడు. కానీ, చాలా మంది ఏదేమైనా అలా కొట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు.

చదవండి: Virat Kohli: న్యూలుక్‌లో కోహ్లి.. వైరల్‌ ఫొటో!

మరిన్ని వార్తలు