భారత టీ20 జట్టు కోచ్‌ పదవిపై హర్భజన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

24 Nov, 2022 17:28 IST|Sakshi

టీమిండియా కోచ్‌ పదవిపై టీమిండియా మాజీ స్పిన్నర్‌, ప్రస్తుత ఎంపీ హర్భజన్‌ సింగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. భారత టీ20 జట్టు కోచ్‌గా తన మాజీ సహచరుడు ఆశిష్‌ నెహ్రా అయితే బెటర్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను తక్కువ చేయాలన్నది తన ఉద్దేశం కాదని, నెహ్రా అయితే టీ20 జట్టు కోచ్‌ పదవికి పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నానని మనసులో మాటను బయటపెట్టాడు.

నెహ్రాకు పొట్టి ఫార్మాట్‌పై మంచి పట్టు ఉందని, కెరీర్‌ చరమాంకంలో అతను టీ20ల్లో అద్భుతంగా రాణించాడని, కేవలం ఇదే కారణంగానే ద్రవిడ్‌ బదులు నెహ్రాకు తను ఓటు వేస్తానని చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కోచ్‌ల ప్రతిపాదన తెరపైకి వస్తున్న నేపథ్యంలో.. తన అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని, ఇందులో ఎవ్వరినీ కించపరచాలన్నది తన ఉద్దేశం కాదని అన్నాడు.

ఒకవేళ బీసీసీఐ ముగ్గురు కోచ్‌ల ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే.. ద్రవిడ్‌తో పాటు నెహ్రాకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అపార అనుభవమున్న ద్రవిడ్‌ను భారత టెస్ట్‌ జట్టు కోచ్‌గా, నెహ్రాను టీ20 టీమ్‌ కోచ్‌గా నియమిస్తే..భారత్‌కు రెండు ఫార్మాట్లలో తిరుగుండదని అన్నాడు. ఇదే సందర్భంగా సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌పై కూడా భజ్జీ స్పందించాడు. మొదటి మూడూ స్థానాల్లో వచ్చే వీరు స్ట్రయిక్‌ రేట్‌ మరింత పెంచుకోవాలని, తద్వారా 4, 5 స్థానాల్లో వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గుతుందని సూచించాడు.

కాగా, టీ20 వరల్డ్‌కప్‌-2022లో భారత్‌ సెమీస్‌లో నిష్క్రమించాక కోచ్‌తో సహా జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని అభిమానులు, విశ్లేషకులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఇప్పటినుంచే కొత్తవారికి అవకాశం కల్పించేందుకు సీనియర్లను ఈ ఫార్మాట్‌ నుంచి తప్పించాలని, కోచ్‌గా ద్రవిడ్‌ కూడా ఈ ఫార్మాట్‌కు సూట్‌ కావట్లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు. 
 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు