WC 2023: ఈసారి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు అతడికే.. ఫైనల్లో కివీస్‌తో: మాజీ పేసర్‌

23 Sep, 2023 21:03 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా- కుల్దీప్‌ యాదవ్‌ (PC: BCCI)

ICC World Cup 2023:‘‘అప్పుడు.. యువీ పాజీ జట్టు కోసం ఏం చేశాడో తెలుసుగా.. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అతడి సొంతమైంది. ఈసారి అలాంటి ఆల్‌రౌండర్‌ ఎవరైనా ఉన్నారా అంటే అది హార్దిక్‌ పాండ్యానే. అతడు ఈసారి ఆ అవార్డు అందుకునే ఛాన్స్‌ ఉంది. టీమిండియాకు అత్యంత ప్రధానమైన ఆటగాడు’’ అని టీమిండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ అన్నాడు. 

వన్డే వరల్డ్‌కప్‌-2011లో యువరాజ్‌ సింగ్‌ మెరుపుల మాదిరే ఈసారి పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అద్భుతం చేయగలడని జోస్యం చెప్పాడు. అదే విధంగా హార్దిక్‌తో పాటు చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు కూడా ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గెలిచే అవకాశాలున్నాయని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

వాళ్లిద్దరు కూడా
ఇక అవార్డుకు మూడో పోటీదారు జస్‌ప్రీత్‌ బుమ్రా అని శ్రీశాంత్‌ చెప్పుకొచ్చాడు. ‘‘హార్దిక్‌ ఫాస్టెస్ట్‌ హండ్రెడ్‌ మర్చిపోవదు.. అలాగే బుమ్రా రెండు 5- వికెట్‌ హాల్స్‌ గుర్తున్నాయి కదా! ఇక మునుపెన్నడూ లేని విధంగా.. కుల్దీప్‌ యాదవ్‌ అద్భుత స్పెల్‌తో దూసుకుపోతున్నాడు.

ఇవన్నీ గమనిస్తే ఈసారి ఈ ముగ్గురిలో ఒకరికి అవార్డు రావడం ఖాయమని అనిపిస్తోంది’’ అని శ్రీశాంత్‌ స్పోర్ట్స్‌కీడాతో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియాతో న్యూజిలాండ్‌ను చూస్తామని శ్రీశాంత్‌ తన అంచనా తెలియజేశాడు.

ఈసారి కప్పు మనదే
2019లో సెమీస్‌లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు భారత్‌.. కివీస్‌ను తప్పక ఓడించాలని ఆకాంక్షించాడు. ఈసారి కప్పు టీమిండియాదే అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023 ఆరంభం కానుంది. 

ఇక టీమిండియా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో.. టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్‌ ఆడనుంది. కాగా 2011లో సొంతగడ్డపై ధోని సేన విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఇందులో కీలక పాత్ర పోషించిన యువీ మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఇక శ్రీశాంత్‌ కూడా ఈ జట్టులో సభ్యుడన్న సంగతి తెలిసిందే.

చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త!

మరిన్ని వార్తలు