Yuzvendra Chahal Funny Video: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్‌'.. రూల్స్‌ ఒప్పుకోవు

4 Aug, 2023 12:42 IST|Sakshi

వెస్టిండీస్‌తో తొలి టి20లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. విండీస్‌ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమవడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమైంది. తిలక్‌ వర్మ 39, సూర్యకుమార్‌ యాదవ్‌ 21 పరుగులు ఉన్నంతవరకు మ్యాచ్‌ టీమిండియావైపే ఉన్నప్పటికి.. స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్‌ కావడం.. ఆ తర్వాత పాండ్యా(19 పరుగులు) వెనుదిరగడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైపోయింది.

సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌లు ఉన్నప్పటికి రాణించడంలో విఫలమయ్యారు. ఇక భారత ఇన్నింగ్స్‌ చివర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యజ్వేంద్ర చహల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై చిన్నపాటి కన్ఫ్యూజన్‌ ఏర్పడింది. వాస్తవానికి 10వ నెంబర్‌లో ముకేశ్‌ కుమార్‌.. చహల్‌ చివరి స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. కుల్దీప్‌ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన సమయంలో టీమిండియా విజయానికి ఐదు బంతుల్లో 10 పరుగులు కావాలి.

ముకేశ్‌ పొడగరి కాబట్టి విండీస్‌ బౌలర్లను ఎదుర్కొని ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అతన్ని పదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు పంపాలని భావించింది. కానీ సమన్వయ లోపంతో చహల్‌ అప్పటికే 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేశాడు. క్రీజులోకి వచ్చేసిన చహల్‌ స్ట్రైకింగ్‌ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాలు డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి బయటికి వచ్చి చహల్‌ను వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. దీంతో చహల్‌ మళ్లీ పెవిలియన్‌ వైపు వెళ్లడానికి సిద్దమయ్యాడు.

కానీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఒక బ్యాటర్‌ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ తిరిగి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. ఈ విషయం పాండ్యా, ద్రవిడ్‌లకు లేటుగా తెలియడంతో ఏం చేయలేకపోయారు. కెప్టెన్‌ పిలుపుతో ఆల్‌మోస్ట్‌ బౌండరీ లైన్‌ దగ్గరికి వచ్చిన చహల్‌ను అంపైర్‌ వెనక్కి పిలవడంతో మళ్లీ బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది.

ఈ సమయంలో ముకేశ్‌ కుమార్‌ బౌండరీ లైన్‌ వద్ద బ్యాటింగ్‌కు  వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి చహల్‌ చర్య మనకు నవ్వు తెప్పిస్తే.. మేనేజ్‌మెంట్‌ను మాత్రం గందరగోళానికి గురి చేసింది. ఇక చివరి ఐదు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన టీమిండియా నాలుగు పరుగుల తేడాతో మ్యాచ్‌ను విండీస్‌కు అప్పగించింది.

చదవండి: ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు.. శాంసన్‌ కెరీర్‌ ముగిసినట్లా!

మరిన్ని వార్తలు