Ind Vs Aus: గిల్‌కు జోడీగా టీమిండియా ఇన్నింగ్స్‌ ఆరంభించేది అతడే: హార్దిక్‌ పాండ్యా

17 Mar, 2023 09:56 IST|Sakshi
గిల్‌తో పాండ్యా

India vs Australia, 1st ODI- Hardik Pandya: ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ఓపెనింగ్‌ జోడీ గురించి జరుగుతున్న చర్చపై హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ జట్టులోకి రానున్నట్లు తెలిపాడు. టీమిండియా నయా స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇషాన్‌ టీమిండియా ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడని తాత్కాలిక సారథి హార్దిక్‌ పాండ్యా స్పష్టం చేశాడు.

ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌కు ఆసీస్‌తో వన్డేల్లో ఓపెనర్‌గా స్థానం లేదని స్పష్టమైంది. కాగా గత కొంతకాలంగా రాహుల్‌ స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమవుతున్నాడు. అయినప్పటికీ మేనేజ్‌మెంట్‌ అతడికి వరుస అవకాశాలు ఇచ్చింది.

వైఫల్యాల కారణంగా రాహుల్‌
అయినప్పటికీ ఈ కర్ణాటక బ్యాటర్‌ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లకు రాహుల్‌ను పక్కన పెట్టిన యాజమాన్యం గిల్‌కు అవకాశం ఇవ్వగా సెంచరీతో సత్తా చాటాడు. 

ఈ క్రమంలో మార్చి 17- 22 వరకు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది. ముంబై, వైజాగ్‌, చెన్నైలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక తొలి వన్డేకు రోహిత్‌ శర్మ దూరం కావడంతో పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టగా.. ఇషాన్‌కు ఓపెనర్‌గా లైన్‌ క్లియర్‌ అయింది. ఈ విషయాన్ని పాండ్యా స్వయంగా ధ్రువీకరించాడు.

వాళ్లే ఓపెనర్లు
ఈ మేరకు... ‘‘ఇషాన్‌, శుబ్‌మన్‌ భారత ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారు. గత ఏడేళ్లుగా నేను ఇక్కడ క్రికెట్‌ ఆడుతున్నా. ఈ వికెట్‌ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు’’ అని పాండ్యా మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే.. పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్న రాహుల్‌ ఇప్పటికే వైస్‌ కెప్టెన్‌ హోదాను కోల్పోయాడు. వరుస వైఫల్యాలతో ఓపెనింగ్‌ స్థానాన్ని కూడా కోల్పోయిన అతడు.. మిడిలార్డర్‌లో ఆడేందుకు సమాయత్తమయ్యాడు.

కొన్ని రోజులుగా రాహుల్‌ స్థానంలో.. రోహిత్‌కు జోడీగా ఓపెనింగ్‌ చేస్తున్న గిల్‌ పటిష్ట ఆస్ట్రేలియాపై పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఎలా రాణించనున్నాడో అన్న అంశం ఆసక్తికరంగా మారింది. కంగారూలతో టెస్టుల్లో సెంచరీ బాదిన ఈ ‘వన్డే డబుల్‌ సెంచరీ వీరుడు’ మరోసారి సత్తా చాటడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: Ind Vs Aus: నేనెలా అర్హుడిని అవుతాను?! అసలు జట్టులోకి వచ్చే ఆలోచనే ఇప్పట్లో లేదు!
Rishabh Pant: ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు! పంత్‌ను కలిసిన యువీ.. ఫొటో వైరల్‌

మరిన్ని వార్తలు