Bumrah-Hardik Pandya: బుమ్రా దూరం.. హార్దిక్‌ పాండ్యా ఎమోషనల్‌ ట్వీట్‌

4 Oct, 2022 12:16 IST|Sakshi

టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా టి20 ప్రపంచకప్‌కు దూరమైన వేళ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎమెషనల్‌ ట్వీట్‌ చేశాడు. ''మై జస్సీ..నువ్వు ఎప్పటిలాగే బలంగా తిరిగి రావాలి'' అంటూ లవ్‌ సింబల్స్‌ జత చేసి క్యాప్షన్‌ పెట్టాడు. పాండ్యా పెట్టిన పోస్టుకు అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దాదాపు 41 వేల లైక్స్‌ రాగా.. వెయ్యికి పైగా రీట్వీట్స్‌ వచ్చాయి.

ఇక వెన్ను గాయంతో బాధపడుతున్న భారత పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వచ్చే టి20 వరల్డ్‌కప్‌ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటికే సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు దూరమయిన బుమ్రా తాజాగా పొట్టి ప్రపంచకప్‌కు కూడా అందుబాటులో ఉండడు.  పూర్తిగా కోలుకోలేదంటూ వైద్యబృందం నివేదిక ఇచ్చిన అనంతరం బీసీసీఐ సోమవారం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. బుమ్రా గాయాన్ని పూర్తిగా సమీక్షించడంతో పాటు నిపుణులతో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. బుమ్రా స్థానంలో ఎంపిక చేసే ఆటగాడి పేరును త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ పేర్కొంది. 

వెన్నునొప్పితో బాధపడిన బుమ్రా చాలాకాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే పూర్తిగా కోలుకోకముందే అతన్ని ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసి బీసీసీఐ మూల్యం చెల్లించుకుంది. ఆసీస్‌తో రెండు టి20 మ్యాచ్‌లు ఆడిన అనంతరం బుమ్రాకు వెన్నునొప్పి మళ్లీ తిరగబెట్టింది. దీంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు బుమ్రా దూరమయ్యాడు. ఆ తర్వాత బుమ్రా ప్రపంచకప్‌కు పూర్తిగా దూరం కాలేదని బీసీసీఐ బాస్‌ గంగూలీ పేర్కొనడం.. కోచ్‌ ద్రవిడ్‌ కూడా బుమ్రా టి20 ప్రపంచకప్‌ ఆడే అవకాశాలున్నాయని చెప్పడంతో అభిమానులు బుమ్రా తిరిగి మళ్లీ జట్టులోకి వస్తాడని భావించారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఈ మెగా ఈవెంట్‌కు బుమ్రా దూరమయ్యాడని బీసీసీఐ స్వయంగా ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశచెందుతున్నారు.

ఇక సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌ ముగిసిన తర్వాత టి20 ప్రపంచకప్‌ కోసం అక్టోబర్‌ 6న ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. ఇక శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని మరో జట్టు ప్రొటిస్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇక టీమిండియా టి20 ప్రపంచకప్‌లో తమ తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో(అక్టోబర్‌ 23న) తలపడనుంది.

చదవండి: మారువేషంలో జడేజా.. అంతా ఉనాద్కట్‌ మాయ!

'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం

మరిన్ని వార్తలు