Prithvi Shaw: ఒహో.. చివరికి పృథ్వీని ఇలా కూల్‌ చేశారా

2 Feb, 2023 07:45 IST|Sakshi

న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన మూడో టి20లో టీమిండియా న్యూజిలాండ్‌ను 168 పరుగుల భారీ తేడాతో ఓడించి టి20 చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శుబ్‌మన్‌ గిల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌కు తోడు టీమిండియా బౌలర్లు సమిష్టి ప్రదర్శన కనబరిచడంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఈ విషయం పక్కనబెడితే సిరీస్‌లో అన్యాయం ఎవరికైనా జరిగిందంటే అది పృథ్వీ షాకు. వరుసగా విఫలమవుతున్న ఇషాన్‌ కిషన్‌ను ఆడించారే తప్ప ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పృథ్వీ షాకు కనీసం చాన్స్‌ కూడా ఇవ్వలేదు. రంజీ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికి దిష్టిబొమ్మలా అతన్ని బెంచ్‌కే పరిమితం చేశారు.

కనీసం మూడో టి20లోనైనా పృథ్వీని ఆడిస్తారనుకుంటే అదీ జరగలేదు. దీంతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై బుధవారం ట్విటర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. పాండ్యా ఆలోచన ఏంటో అర్థం కావడం లేదు.. టాలెంట్‌ ఉన్న పృథ్వీషాను తొక్కేస్తున్నారని.. ఫామ్‌లో లేకపోయినా ఇషాన్‌ కిషన్‌ను ఆడించడం ఏంటని.. ఒక్కచాన్స్‌ ఇస్తే కదా అతను ఆడేది లేనిది తెలిసేది.. చెత్త రాజకీయాల వల్ల ఇలా ఎంతో మంది క్రికెటర్లు మ్యాచ్‌లు ఆడకుండానే వెళ్లిపోతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ విషయం పాండ్యాకు తెలిసిందో ఏమో గానీ.. మ్యాచ్‌ విజయం తర్వాత అతను చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రోఫీ అందుకున్న పాండ్యా దానిని నేరుగా తీసుకెళ్లి పృథ్వీ షా చేతిలో పెట్టాడు. పైకి నవ్వుతున్నట్లు కనిపించినా.. పృథ్వీ షా ఈ చర్యతో లోలోపల షాక్‌కు గురయ్యే ఉంటాడు. రంజీల్లో రాణించి జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికి బెంచ్‌కే పరిమితం చేశారన్న కోపం పృథ్వీ షాలో ఏ మూలనో ఉండే ఉంటుంది. అయితే ఇది పసిగట్టిన పాండ్యా తెలివిగా అతని చేతికి ట్రోఫీని అందించి కూల్‌ చేయడం ఆసక్తి కలిగించింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పాండ్యా తీరును కొందరు మెచ్చుకుంటే.. కొందరు మాత్రం తప్పుబట్టారు. ''పృథ్వీ షాను ఒక్కమ్యాచ్‌ ఆడించలేదన్న విమర్శలు రావొద్దన్న భయంతోనే ఈ పని చేసి ఉంటాడు..పాండ్యా నీ తెలివికి జోహార్లు.. ఒహో చివరికి పృథ్వీ షాను ఇలా కూల్‌ చేశారా'' అంటూ కామెంట్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.

చదవండి: 'ఆ విషయాలు పెద్దగా పట్టించుకోను.. భవిష్యత్తుకు డోకా లేనట్లే'

మరిన్ని వార్తలు