Rohit Sharma: ఫిట్‌నెస్‌ సమస్యలతో రోహిత్‌.. టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌ ఎంపిక ఖరారు!? అయితే..

22 Dec, 2022 13:53 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా- రోహిత్‌ శర్మ

Hardik Pandya- Rohit Sharma- India ODI, T20I captain: టీమిండియాలో కెప్టెన్సీ విషయంలో మార్పు చోటు చేసుకోనుందా? పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సారథిగా రోహిత్‌ శర్మకు ఉద్వాసన పలికేందుకు బీసీసీఐ సిద్ధమవుతోందా? త్వరలోనే అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కొత్త కెప్టెన్‌గా నియమితుడు కావడం లాంఛనమే! అంటూ గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది.

35 ఏళ్ల రోహిత్‌ శర్మ తరచూ ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ వాదనలకు బలం చేకూరుతోంది. టెస్టు కెప్టెన్‌గా తొలి టూర్‌లో భాగంగా సౌతాఫ్రికాతో సిరీస్‌కు గాయం వల్ల రోహిత్‌ దూరమైన విషయం తెలిసిందే. అదే విధంగా ఇటీవల వివిధ సిరీస్‌లలోనూ విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉన్నాడు.

కీలక​ సమయాల్లో వైఫల్యం
ఇదిలా ఉంటే.. టీ20 కెప్టెన్‌గా ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయవంతమైనా.. కీలకమైన ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీల్లో మాత్రం తేలిపోయాడు ‘హిట్‌మ్యాన్‌’. బ్యాటర్‌గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక బంగ్లాదేశ్‌తో టూర్‌లో రెండో వన్డే సందర్భంగా గాయపడ్డ రోహిత్‌.. ఇంకా కోలుకోలేదు. దీంతో టెస్టు సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు.

అందుకేనా?!
ఇక.. ఈ టూర్‌ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో వరుస సిరీస్‌లు ఆడాల్సి ఉంది. రోహిత్‌ ఇలాగే ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమతమైతే గతంలో మాదిరే తరచూ కెప్టెన్లను మార్చాల్సిన దుస్థితి వస్తుంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.

ఇప్పటికే పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ ఈవెంట్‌లో వైఫల్యం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సెలక్షన్‌ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ.. కెప్టెన్సీ విషయంలోనూ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోహిత్‌ గైర్హాజరీలో ఇప్పటికే టీమిండియా టీ20 జట్టు సారథిగా వ్యవహరిస్తున్న హార్దిక్‌ పాండ్యాను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమించేందుకు సిద్ధమవుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

హార్దిక్‌కు సమాచారం
ఈ విషయం గురించి ఇప్పటికే హార్దిక్‌కు సమాచారం కూడా అందినట్లు కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ ఆలోచనపై స్పందించిన హార్దిక్‌.. తనకు కొంత సమయం కావాల్సిందిగా కోరినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏమో చూడాలి
అయితే, బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లో కెప్టెన్సీ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదని, సెలక్షన్‌ కమిటీ ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు.  మరోవైపు... గాయం నుంచి రోహిత్‌ ఇంకా కోలుకోకపోవడంతో శ్రీలంకతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు మాత్రమే హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌ కథనం పేర్కొంది. 

అక్కడే రోహిత్‌కు ‘వీడ్కోలు’!
కానీ, బీసీసీఐ మాజీ అధికారి ఒకరు  మాట్లాడుతూ.. ‘‘ముంబైలోని వాంఖడేలో శ్రీలంకతో తొలి మ్యాచ్‌. ఇది రోహిత్‌ హోం గ్రౌండ్‌. ఒకవేళ రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనుకుంటే సెలక్టర్లు, జై షా కలిసి అతడికి అక్కడే.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఘనమైన వీడ్కోలు ఇవ్వొచ్చు కదా!’’ అని పేర్కొనడం గమనార్హం.

చదవండి: Ind VS Ban 2nd Test: టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్‌ను తప్పించి.. 12 ఏళ్ల తర్వాత..
10 వికెట్లతో చెలరేగిన చైనామన్‌ స్పిన్నర్‌.. కుప్పకూలిన బ్యాటింగ్‌ ఆర్డర్‌

మరిన్ని వార్తలు