Hardik Pandya: కలిస్‌, కోహ్లి, సచిన్‌ సర్‌ ఇష్టం... నా ఫేవరెట్‌ క్రికెటర్‌ మాత్రం ఆయనే! ఎందుకంటే!

8 Jun, 2022 11:30 IST|Sakshi

Hardik Pandya Favourite Cricketer: ‘‘సాధారణంగా ప్రతి ఒక్కరికి ఫేవరెట్‌ క్రికెటర్లు ఉంటారు. నేను కూడా అంతే! జాక్వెస్‌ కలిస్‌, విరాట్‌ కోహ్లి, సచిన్‌ సర్‌ అంటే చాలా ఇష్టం. అయితే, ఎంతో మంది దిగ్గజాలు ఉన్నపుడు ఒకరిని ఎంచుకోవడం కష్టం. నాకైతే అత్యంత ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరంటే మాత్రం వసీం జాఫర్‌ పేరు చెబుతాను’’ అంటూ టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా తన మనసులోని మాట బయటపెట్టాడు.

తనకు అత్యంత ఇష్టమైన క్రికెటర్‌గా టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ పేరు చెప్పాడు. ఇక వసీం జాఫర్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయేవాడన్న హార్దిక్‌.. మిగతా దిగ్గజాలతో పోలిస్తే ఆయనకు తన మనసులో అగ్రస్థానం ఉంటుందని పేర్కొన్నాడు. 

‘‘నిజానికి ఆయన బ్యాటింగ్‌ను కాపీ కొట్టాలని ప్రయత్నించాను. కానీ, అతడి క్లాస్‌ను అందుకోలేకపోయాను’’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైన హార్దిక్‌ పాండ్యా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో బీసీసీఐ ప్రకటించిన 18 మంది సభ్యులతో కూడిన జట్టులో అతడు స్థానం సంపాదించుకున్నాడు. ప్రొటిస్‌తో సిరీస్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2022తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్‌ హార్దిక్‌పై ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న హార్దిక్‌ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని వల్లే ఇక్కడిదాకా వచ్చానంటూ కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. ఈ క్రమంలో ఎస్‌జీ పాడ్‌కాస్ట్‌లో అతడి ఫేవరెట్‌ క్రికెటర్‌ ఎవరా అన్న ప్రశ్నకు వసీం జాఫర్‌ అని సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హార్దిక్‌ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ‘‘సచిన్‌, సెహ్వాగ్‌, ధోని.. కాదు వసీం జాఫర్‌.. సూపర్‌ భాయ్‌.. ఊహించలేదు.. నిజంగా మమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేశావు. ’’ అంటూ ఫ్యాన్స్‌ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

Who Is Wasim Jaffer: వసీం జాఫర్‌ ఎవరంటే?
క్రికెట్‌ను ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు వసీం జాఫర్‌. టీమిండియా మాజీ ఓపెనర్‌గా.. సమకాలీన క్రికెట్‌ సిరీస్‌ల మీద సోషల్‌ మీడియాలో తనదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసిరే వసీంకు ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య(901.2K) కూడా ఎక్కువే.

మహారాష్ట్రకు చెందిన బ్యాటర్‌ వసీం జాఫర్‌ 2000- 2008 మధ్య కాలంలో భారత క్రికెట్‌ జట్టు ప్రాతినిథ్యం వహించారు. మొత్తంగా 31 టెస్టులు ఆడి 1944 పరుగులు చేశాడు. 2 వన్డేల్లో 10 పరుగులు సాధించారు. వసీం జాఫర్‌కు సచిన్‌, ద్రవిడ్‌, సెహ్వగ్‌, లక్ష్మణ్‌ వంటి మేటి బ్యాటర్లు సమకాలీనులు కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు.

అయితే, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మాత్రం ఆయనకు తిరుగులేదు. 260 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో ఏకంగా 19, 410 పరుగులు సాధించాడు. ఇందులో 57 శతకాలు, 91 అర్ధ శతకాలు ఉండటం విశేషం. రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వసీం పేరు చరిత్రకెక్కింది.

ఆటగాడిగానే కాకుండా కోచ్‌గానూ వసీం జాఫర్‌ సేవలు అందించాడు. 2020-2021 సీజన్‌లో ఉత్తరాఖండ్‌కు ఆయన కోచ్‌గా ఉన్నాడు. ఇ‍క 2021 జూలైలో ఒడిశా జట్టు హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు.

చదవండి: Ind vs SA 3rd T20I- Visakhapatnam: హాట్‌కేకుల్లా అమ్ముడైన ఆన్‌లైన్‌ టికెట్లు.. ఆఫ్‌లైన్‌లో కొనాలంటే!
 

మరిన్ని వార్తలు