అప్పుడు కృనాల్,‌ టామ్‌.. ఇప్పుడు హార్దిక్‌, సామ్

27 Mar, 2021 11:25 IST|Sakshi

పుణే: టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న సిరీస్‌లో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సిరీస్‌ ఆసక్తికరంగా సాగుతున్న వేళ ఆటగాళ్ల మధ్య గొడవలతో మ్యాచ్‌లు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. మొదటి వన్డేలో కృనాల్‌ పాండ్యా- టామ్‌ కరన్‌, కోహ్లి-బట్లర్‌ల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది.  తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ మధ్య రెండో వన్డేలో మాటల యుద్ధం చోటుచేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్‌ 46వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

సామ్‌ కరన్‌ వేసిన యార్కర్‌ను పాండ్యా ఆడడంలో విఫలమయ్యాడు. దీంతో సామ్‌‌ కరన్‌ పాండ్యాను ఉద్దేశించి 'నా యార్కర్‌ను నువ్వు ఆడలేవు' అంటూనే మరిన్ని కఠిన వ్యాఖ్యలు చేశాడు. అసలే కోపానికి మారుపేరుగా ఉండే హార్దిక్..‌ సామ్‌ కరన్‌ వైపు వేగంగా పరిగెత్తుకొచ్చి తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో సామ్‌ కరన్‌ మరోసారి వెనక్కి తిరిగి ఏదో అనబోగా పాండ్యా మరోసారి బ్యాట్‌ చూపిస్తూ సమాధానమిచ్చాడు.ఇంతలో అంపైర్‌ జోక్యంతో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై నెటిజన్లు మాత్రం  తమదైన శైలిలో ట్రోల్‌ చేశారు. మొదటి వన్డేలో కృనాల్‌.. టామ్‌ కరన్‌.. ఇప్పుడు హార్దిక్‌.. సామ్‌ కరన్‌ల మధ్య గొడవ.. ఇరు జట్ల సోదరుల వైరం.. భలే గమ్మత్తుగా ఉంది'' అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇక​ మ్యాచ్‌ విషయానికి వస్తే ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... రిషభ్‌ పంత్‌ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), కోహ్లి (79 బంతుల్లో 66; 3 ఫోర్లు, 1 సిక్స్‌) సహకరించారు. అనంతరం ఇంగ్లండ్‌ 43.3 ఓవర్లలో 4 వికెట్లకు 337 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెయిర్‌స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకం సాధించగా... స్టోక్స్‌ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు), జేసన్‌ రాయ్‌ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచారు.
చదవండి:
రనౌట్‌ వివాదం.. స్టోక్స్‌ అవుటా.. కాదా?
వైరల్‌: సహనం కోల్పోయిన కృనాల్‌.. అంపైర్‌ జోక్యంతో!

మరిన్ని వార్తలు