Hardik Pandya: 'ఫైనల్‌ మ్యాచ్‌లు నాకు కలిసొచ్చాయి.. గుజరాత్‌ టైటాన్స్‌దే కప్‌'

29 May, 2022 18:46 IST|Sakshi
PC: IPL Twitter

రెండు నెలల పాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 2022 సీజన్‌కు నేటితో తెరపడనుంది. రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ పోరుకు మరికొద్ది గంటలే మిగిలి ఉంది. అరంగేట్రం సీజన్‌లోనే అదరగొట్టి ఫైనల్‌కు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌ కప్‌ కొడుతుందో.. లేక 2008 తొలి ఐపీఎల్‌ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ రెండోసారి విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా అన్నీ తానై నడిపిస్తున్న హార్దిక్‌ పాండ్యా సీజన్‌లో సూపర్‌ హిట్‌ అయ్యాడు. ఈ సీజన్‌లో పాండ్యా 14 మ్యాచ్‌ల్లో 453 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 5 వికెట్లు తీశాడు. లీగ్‌ ప్రారంభానికి ముందు గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుపై అంచనాలు పెద్దగా ఎవరికి లేవు. కానీ అనూహ్యంగా హార్దిక్‌ సేన లీగ్‌లో అప్రతిహాత విజయాలు నమోదు చేసి గ్రూఫ్‌ టాపర్‌గా ప్లేఆఫ్‌ చేరింది. అంతే వేగంగా ప్లేఆఫ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను మట్టికరిపించి ఫైనల్‌ చేరింది.

కాగా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా ఐపీఎల్‌లో ఇప్పటివరకు నాలుగు ఫైనల్స్‌ ఆడాడు. అతను ఆడిన నాలుగు సందర్బాల్లోనూ ముంబై ఇండియన్స్‌ విజేతగా నిలిచింది. 2015 నుంచి 2021 సీజన్‌ వరకు పాండ్యా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.  2015,2017,2019,2020లో ముంబై ఇండియన్స్‌ చాంపియన్‌గా నిలిచింది. వాస్తవానికి క్రెడిట్‌ మొత్తం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకే దక్కుతుంది. కానీ ఒక రకంగా చూస్తే పాండ్యాకు ఐపీఎల్‌ ఫైనల్స్‌ బాగా కలిసొచ్చాయి. అందుకే రాజస్తాన్‌ రాయల్స్‌తో ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.

''నేను ఇప్పటివరకూ ఆడిన ఏ ఫైనల్ మ్యాచ్ ఓడిపోలేదు. అప్పుడు ముంబై ఇండియన్స్‌ తరపున ఒక ప్లేయర్‌గా ఉన్నాను. ఇప్పుడు కెప్టెన్‌గా మరో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఫైనల్స్‌ నాకు ఎప్పుడు కలిసొచ్చాయి. అందుకే గుజరాత్‌ టైటాన్స్‌దే కప్‌'' అంటూ పేర్కొన్నాడు. కాగా పాండ్యా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

చదవండి: IPL 2022 Final: ఎవరు గెలిచినా చరిత్రే.. టాస్‌ ఓడితే మాత్రం అంతే సంగతులు! అయితే..

మరిన్ని వార్తలు