హార్దిక్‌ పాండ్యా తండ్రి కన్నుమూత

16 Jan, 2021 11:22 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంట విషాదం చోటు చేసుకుంది. అతని తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా క్రికెటర్‌కాగా.. ప్రస్తుతం అతను సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. తండ్రి మృతి విషయం తెలియగానే హుటాహుటిన అతను ఇంటికి పయనమయ్యాడు. ఇక త్వరలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ ఆరంభమయ్యే క్రమంలో హార్దిక్‌ పాండ్యా ట్రైనింగ్‌ సెషన్‌లో ఉన్నాడు. ఇటీవల ఆసీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ తర్వాత ఇంటికి వచ్చిన హార్దిక్‌.. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నద్ధం అవుతున్నాడు. 

తండ్రి హిమాన్షు పాండ్యా అంటే హార్దిక్ పాండ్యాకి చాలా ఇష్టం. అన్న కంటే ముందు టీమిండియాకి ఆడిన హార్దిక్ పాండ్యా.. తన సంపాదనతో హిమాన్షు పాండ్యాకి ఖరీదైన కారుని బహూకరించాడు. అప్పట్లో ఓ విదేశీ టూర్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా.. కారుని బుక్ చేసి షోరూమ్‌కి తండ్రిని తీసుకెళ్లాల్సిందిగా కృనాల్‌, తన కజిన్‌ని కోరాడు. అక్కడ హిమాన్షుకి అందరూ కలిసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. 

హిమాన్షు పాండ్య అప్పట్లో సూరత్‌లో కార్ల ఫైనాన్స్ బిజినెస్ చేసేవారు. అయితే.. కొడుకుల క్రికెట్ ట్రైనింగ్ కోసం ఆ బిజినెస్‌ని వదిలేసి ఫ్యామిలీని వడోదరికి మార్చేశారు. అక్కడే భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో చేర్పించి శిక్షణ ఇప్పించారు. మొత్తానికి అతని కష్టం ఫలించింది. హార్దిక్, కృనాల్ పాండ్యా టీమిండియా తరఫున ఆడారు. 

హార్దిక్‌-కృనాల్‌ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా మృతి చెందిన వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయన ఇక లేరన్న వార్తతో గుండె పగిలింది. ఆయనతో నేను చాలాసార్లు మాట్లాడా. మంచి సరదా అయిన మనిషి. కుటుంబానికి విలువనిచ్చే పనిషి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. హార్దిక్‌-కృనాల్‌లు ధైర్యంగా ఉండాలి.
విరాట్‌  కోహ్లి, టీమిండియా కెప్టెన్‌

నేను ఆయన్ను మోతిబాగ్‌లో తొలిసారి కలిశా. అది ఇంకా గుర్తుంది. ఆ సమయంలో హార్దిక్‌-కృనాల్‌లు చాలా చిన్నవారు. అప్పటికే వారు మంచి క్రికెట్‌ ఆడుతున్నారు.  ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ కష్టసమయంలో వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా
ఇర్ఫాన్‌ పఠాన్‌, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌

మరిన్ని వార్తలు