అతనే నాకు స్ఫూర్తి.. ఆ అవార్డు నాకెందుకు?

7 Dec, 2020 16:04 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడానికి హార్దిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. రన్‌రేట్‌ పెరుగుతున్న క్రమంలో బ్యాట్‌ ఝుళిపించి అప్పటివరకూ ఆసీస్‌ వైపు ఉన్న మ్యాచ్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా  42 పరుగులు సాధించాడు. ప్రధానం ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించడం హైలైట్‌గా నిలిచింది. దాంతో హార్దిక్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. దీనిపై అవార్డు తీసుకున్న తర్వాత హార్దిక్‌ మాట్లాడుతూ.. ‘నాకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించడం ఆశ్చర్యపరిచింది. (ధావన్‌.. నేను ధోనిని కాదు: వేడ్‌)

మేము గెలవడానికి ఆసీస్‌ను భారీ పరుగులు చేయకుండా కట్టడి చేయడమే. ఆసీస్‌ ఇంకా 10 నుంచి 15 పరుగులు చేయాల్సి ఉన్నా కట్టడి చేయగలిగాం. దానికి నటరాజన్‌ బౌలింగ్‌ స్పెల్స్‌ ఒక కారణం. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌కు నటరాజన్‌ అర్హుడు. మేము గెలవడానికి పరుగుల్లో వ్యత్యాసం తీసుకురావడమే’ అని పాండ్యా తెలిపాడు. నిన్నటి మ్యాచ్‌లో నటరాజన్‌ నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 20 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు సాధించాడు. నటరాజన్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. (వాటే క్యాచ్‌ పృథ్వీ షా..)

ఇక తన భారీ హిట్టింగ్‌ గురించి మాట్లాడిన హార్దిక్‌ మాట్లాడుతూ.. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ కీరోన్‌ పొలార్డే తనకు ఆదర్శమన్నాడు. ‘ పొలార్డ్‌ షాట్లను అతి దగ్గర నుంచి చూసినవాళ్లలో నేను ఒకడ్ని. ఇది నిజంగా నా అదృష్టం. మేము చాలా కాలంగా ఐపీఎల్‌లో ఆడుతున్నాం. ఫ్రాంచైజీ క్రికెట్‌లో మునిగితేలుతున్నాం. దాన్ని ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో కూడా కొనసాగిస్తున్నాం. మనకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడిలో పడినప్పుడు ఐపీఎల్‌ ఆడిన అనుభవం బాగా ఉపయోగపడుతుంది. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో నేను బాగా బ్యాటింగ్‌ చేశా. లాక్‌డౌన్‌ సమయంలో ఎలా మ్యాచ్‌లు ఫినిష్‌ చేయాలనే దానిపై వర్కౌట్‌ చేశా’ అని పేర్కొన్నాడు. ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను ఇంకా రెండు బంతులుండగా ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. 

>
మరిన్ని వార్తలు