Haris Rauf: నోబాల్‌ విషయంలో పాక్‌ క్రికెటర్‌ నానా యాగీ

29 Jan, 2023 09:10 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెటర్‌ హారిస్‌ రవూఫ్‌  నోబాల్‌ విషయమై అంపైర్‌తో నానా యాగీ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌)లో భాగంగా ఇది చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా రంగ్‌పూర్‌ రైడర్స్‌, సిల్హెట్‌ స్ట్రైకర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ రోబుల్‌ హక్‌ వేశాడు. వరుసగా రెండు బంతులు బౌన్సర్లు వేయడంతో.. ఫీల్డ్‌ అంపైర్‌ రెండో బంతిని నోబాల్‌గా ప్రకటించాడు.

అయితే అంపైర్‌ నో బాల్‌ ఇ‍వ్వడంపై రంగ్‌పూర్‌ రైడర్స్‌ కెప్టెన్‌ నురుల్‌ హసన్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంపైర్‌తో వివాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన హారిస్‌ రవూఫ్‌ జోక్యం చేసుకొని అసలెలా నోబాల్‌ ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బౌన్సర్లు వేస్తే వార్నింగ్‌తో సరిపెట్టాలని రూల్‌ ఉన్నా.. పట్టించుకోకుండా నోబాల్‌ ఇవ్వడమేంటన్నాడు. అయితే అంపైర్‌ తన నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో నురుల్‌ హసన్‌, హారిస్‌ రవూఫ్‌లు కోపంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. రంగ్‌పూర్‌ రైడర్స్‌ సిల్హెట్‌ స్ట్రైకర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిల్హెట్‌ స్ట్రైకర్స్‌.. రంగ్‌పూర్‌ రైడర్స్‌ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేయగలిగింది. 18 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో తంజిమ్‌ హసన్‌ సకీబ్‌(41 పరుగులు), కెప్టెన్‌ మొర్తజా(21 పరుగులు).. ఎనిమిదో వికెట్‌కు 50 పరుగులు జోడించారు.  రంగ్‌పూర్‌ రైడర్స్‌ బౌలర్లలో హసన్‌ మహ్మూద్‌​, అజ్మతుల్లాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన రంగ్‌పూర్‌ రైడర్స్‌ 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రోనీ తాలుక్‌దార్‌ 41 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.

చదవండి: 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' పాటతో స్కేటింగ్‌లో గోల్డ్‌ మెడల్‌

బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్‌ ఎందుకు?

మరిన్ని వార్తలు