కష్టాల కడలి దాటి.. క్రికెట్‌ ఒడిలోకి

10 Feb, 2021 14:54 IST|Sakshi
ఏసీఏ తొలి మహిళా అంపైర్‌గా ఎంపికైన హరీషా

ఏసీఏ తొలి ఉమన్‌ అంపైర్‌గా హరీషా ఎంపిక

చేయూతనిస్తున్న జిల్లా క్రికెట్‌ సంఘం  

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌లో తొలి మహిళా అంపైర్‌గా ఎంపికైన వై.హరీషా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. అడ్డంకులను అధిగమిస్తూ.. కష్టాలనే విజయ సోపానాలుగా మలుచుకుంటూ విజేతగా నిలిచింది. హరీషా చిన్న వయసులోనే తండ్రి కన్నుమూశాడు.. బరువు.. బాధ్యత మోసిన మాతృమూర్తి తన ఎదుగుదలను చూడకముందే మృత్యుఒడికి చేరింది.. ఇలా అనుకోని కష్టాల కడలి దాటి క్రికెట్‌ ఒడికి చేరింది. శ్రమయేవ జయతే నినాదాన్ని నిజం చేస్తూ  తల్లి ఆశయాన్ని.. తన లక్ష్యాన్నీ సాధించింది. ప్లేయర్‌గానే కాదు అంపైరింగ్‌లోనూ అడుగు పెట్టి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వై. హరీషా విజయగాథపై ప్రత్యేక కథనం.  

సాక్షి, కడప : కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వై. హరీషా స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల. తండ్రి చిన్న వయసులోనే చనిపోగా పోషణ భారమంతా  తల్లిపై పడింది. అప్పటి నుంచి అన్నీతానై అల్లారుముద్దుగా పెంచింది. కూతురు ప్రయోజకురాలైతే చూడాలని ఎంతో ఆశ పడింది. ఆ ఆశ నెరవేరకుండానే కన్నుమూసింది.  

తల్లి ఆశయ సాధన కోసం.. 
కన్న తల్లి దూరమైనా ఆమె ఆశయసాధన కోసం మరింత పట్టుదలగా కృషి చేసింది హరీషా. ఈ క్రమంలో తనకెంతో ఇష్టమైన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. అండర్‌–16, అండర్‌–19 ఉమన్‌టీంకు ప్రాతినిథ్యం వహించింది. జోనల్‌స్థాయి పోటీల్లో సైతం పాల్గొని ప్రతిభ కనబరిచింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో పరిస్థితులు సహకరించకపోవడంతో క్రికెట్‌కు స్వస్తిపలికి చదువుపై దృష్టి సారించింది. తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువుల సహకారంతో కడపలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో చేరింది. అక్కడ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆనంద్‌ ఆమెలోని ప్రతిభను గుర్తించి క్రికెట్‌లోకి మళ్లీ రావాలని ప్రోత్సహించాడు. అంతేకాకుండా క్రికెట్‌ సంఘం పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు.  జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం. భరత్‌రెడ్డి, పి. సంజయ్‌కుమార్‌ల బృందం ఆమె బాగోగులు చూసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు సహకారం అందిస్తామని తెలిపారు. దీంతో క్రికెట్‌లో ఈమె కడప నుంచి ప్రాతినిథ్యం వహిస్తోంది. 

ఏసీఏ తొలి మహిళా అంపైర్‌గా.. 
ఇప్పటి వరకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ పరిధిలో మహిళా క్రీడాకారిణులు తమ క్రికెట్‌ అనంతరం స్కోరర్లుగా పనిచేశారు. అయితే ఎవరూ అంపైరింగ్‌ రంగంలోకి రాలేదు. ఇటీవల జిల్లా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో జనవరి 30న జిల్లాస్థాయి అంపైరింగ్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన ఏకైక మహిళ ఈమె కావడం విశేషం. పరీక్ష ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఫిబ్రవరి 8న నిర్వహించిన ప్రాక్టికల్స్, వైవాలో ఉత్తీర్ణత సాధించడంతో ఈమెను స్టేట్‌ ప్యానల్‌కు అంపైర్‌గా జిల్లా క్రికెట్‌ సంఘం సభ్యులు సిఫార్సు చేశారు. దీనికి ఆంధ్రా క్రికెట్‌ సంఘం అనుమతించడంతో ఈమె తొలి ఏసీఏ అంపైర్‌గా అరుదైన చరిత్రను తనపేరు మీదుగా రాసుకుంది. రానున్న రోజుల్లో ఈమె లెవల్‌–2 అంపైర్‌గా కూడా అవకాశం లభించనుంది.

చదవండి:
ఏంటిది రహానే.. ఇలా చేశావు?  

ఓటమిని ఆహ్వానించిన టీమిండియా

మరిన్ని వార్తలు