Jhulan Goswami: ‘లార్డ్స్‌’లో టీమిండియా సీనియర్‌కు ఘనంగా వీడ్కోలు 

31 Aug, 2022 07:11 IST|Sakshi

బెంగళూరు: ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ జులన్‌ గోస్వామి లార్డ్స్‌ మైదానంలో పరుగు ముగించనుంది. రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌కు మూలస్థంభంలా నిలిచిన పేస్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత రిటైర్‌ కానుంది. సెప్టెంబర్‌ 24న జరిగే మూడో వన్డే ఆమె కెరీర్‌లో చివరిది అవుతుంది. మార్చిలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆడిన జులన్‌ పక్కటెముకల గాయంతో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి పోరులో బరిలోకి దిగలేకపోయింది. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ సమస్యలతోనే శ్రీలంకతో సిరీస్‌కు దూరమైంది.

అయితే జులన్‌లాంటి స్టార్‌కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని భావించిన బీసీసీఐ ఆమెను ఇప్పుడు ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక చేసింది. మహిళల వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జులన్‌ ఆటకు తెర పడనుంది. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన 40 ఏళ్ల జులన్‌ 201 వన్డేల్లో 252 వికెట్లు, 68 టి20ల్లో 56 వికెట్లు తీసింది. మరో 12 టెస్టుల్లో 44 వికెట్లు కూడా పడగొట్టింది. ప్రస్తుత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 2009లో అంత ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పుడు ఆమె తొలి కెప్టెన్‌ జులన్‌ గోస్వామినే కావడం విశేషం. విజయంతో జులన్‌కు వీడ్కోలు పలుకుతామని హర్మన్‌ వ్యాఖ్యానించింది.

‘జులన్‌ చివరి మ్యాచ్‌ కు నేను కెప్టెన్‌ కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నేను వచ్చినప్పుడు ఆమెనుంచి ఎంతో నేర్చుకున్నాను. జులన్‌ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదల అసమానం. ప్రతీ మ్యాచ్‌లో బాగా ఆడేందుకు ఇప్పటికీ కొత్త ప్లేయర్‌గా ప్రతీరోజు 2–3 గంటలు బౌలింగ్‌ చేయడం మామూలు విషయం కాదు. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్‌లోకి వచ్చారు’ అని ఆమె తన గౌరవాన్ని ప్రదర్శించింది.  

మరిన్ని వార్తలు