'ప్రపంచకప్‌లో భారత వైస్ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్'

26 Feb, 2022 14:01 IST|Sakshi

న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్‌- 2022లో భారత జట్టు సత్తా చాటడానికి సిద్దమవుతోంది. అయితే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో భారత్‌ ఓటమి చవిచూసింది. ఇక కివీస్‌ పర్యటనలో పేలవ ప్రదర్శన కనబర్చిన భారత టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా వన్డేల్లో  భారత జట్టు వన్డే కెప్టెన్‌గా  మిథాలీ రాజ్‌ ఉండగా.. వైస్‌ కెప్టెన్‌గా హర్మన్‌ ప్రీత్ కౌర్‌  ఉంది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేకు కౌర్‌ దూరం కావడంతో.. దీప్తి శర్మ వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టింది. కాగా  తిరిగి ఐదో వన్డేలో జట్టులోకి హర్మన్‌ ప్రీత్ కౌర్‌ వచ్చింది. అయినప్పటికీ దీప్తి శర్మనే వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించింది.

ఈ నేపథ్యంలో రానున్న ప్రప్రంచకప్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌ నుంచి తొలిగించనున్నట్లు వార్తలు వినిపించాయి. కాగా ఈ వార్తలపై భారత జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ స్పందించింది. రాబోయే ప్రపంచకప్‌లో భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌ వ్యవహరిస్తుందని మిథాలీ రాజ్‌ సృష్టం​ చేసింది. "దీప్తి శర్మని చివరి రెండు వన్డేలకు వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. కానీ ప్రపంచకప్‌లో మాత్రం హర్మన్‌ప్రీత్ కౌర్‌ వైస్‌ కెప్టెన్‌. యువ క్రికెటర్‌లకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. ఇటువంటి పెద్ద టోర్నమెంట్‌లో ఒత్తిడి తట్టుకోని ఆడాలి. ఒత్తిడితో ఆడితే మీరు ప్రపంచ కప్‌లో అంతగా రాణించకపోవచ్చు" అని  వర్చువల్ విలేకరుల సమావేశంలో మిథాలీ పేర్కొంది. ఇక మార్చి 4 నుంచి ఐసీసీ మహిళల ప్రపంచకప్‌- 2022 ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.

చదవండి: IND vs SL: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు'

మరిన్ని వార్తలు