షాహిద్‌ అఫ్రిదికి షాకిచ్చిన పీసీబీ.. చీఫ్‌ సెలెక్టర్‌ బాధ్యతల నుంచి తొలగింపు

23 Jan, 2023 19:40 IST|Sakshi

Shahid Afridi: పాకిస్తాన్‌ పురుషుల క్రికెట్‌ జట్టు తాత్కాలిక చీఫ్‌ సెలెక్టర్‌, ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిదికి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) షాకిచ్చింది. అఫ్రిదిని సెలెక్టర్‌ పదవి నుంచి తొలిగిస్తున్నట్లు పీసీబీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. అఫ్రిది స్థానంలో 69 ఏళ్ల హరూన్‌ రషీద్‌ను చీఫ్‌ సెలెక్టర్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పీసీబీ పేర్కొంది.

పీసీబీ చీఫ్‌గా నజమ్‌ సేథీ బాధ్యతలు చేపట్టాక నాటి చీఫ్‌ సెలెక్టర్‌ మహ్మద్‌ వసీంను తొలగించిన పీసీబీ.. ఆ పదవిలో అఫ్రిదిని తాత్కాలికంగా కూర్చోబెట్టింది. తాజాగా పీసీబీ అఫ్రిదికి కూడా ఉద్వాసన పలికి హరూన్‌ రషీద్‌కు బాధ్యతలు అప్పజెప్పడం పాకిస్తాన్‌ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్‌ తరఫున 23 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన హరూన్‌ రషీద్‌.. 2015 నుంచి 2016 వరకు పాక్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా పని చేశాడు.

రషీద్‌.. పీసీబీని నడుపుతున్న 14 మంది సభ్యుల క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలోనూ కీలక మెంబర్‌గా కొనసాగుతున్నాడు. కాగా, స్వదేశంలో గతకొంతకాలంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ను తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలెక్షన్‌ కమిటీకి కొత్త బాస్‌ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

>
మరిన్ని వార్తలు