Sexual Harrasment: మహిళా అథ్లెట్‌ కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడామంత్రిపై కేసు

1 Jan, 2023 11:42 IST|Sakshi

హర్యానా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడంటూ జూనియర్‌ మహిళా అథ్లెటిక్స్‌ కోచ్‌ ఆరోపణలు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంత్రిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా మంత్రి సందీప్‌ సింగ్‌ తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం వెంటనే క్రీడాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఐఎన్‌ఎల్‌డి డిమాండ్ చేసింది.

విషయంలోకి వెళితే.. తనను క్రీడామంత్రి సందీప్ సింగ్ లైంగికంగా వేధించాడంటూ బాధితురాలు ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తనను తొలుత జిమ్ లో మంత్రి చూశాడని... ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లో తనకు మెసేజ్ లు పెట్టేవాడని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించారు.

తాను స్పందించకపోవడంతో తనకు రావాల్సిన నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ ను పెండింగ్ లో ఉంచాడని... దీంతో ఆయనను తాను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశానని చెప్పారు. ఆ సందర్భంగా తనతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. మరోవైపు దీనిపై మంత్రి సందీప్‌ సింగ్‌ స్పందిస్తూ... ఆమె చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని ఖండించారు.

చదవండి: ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్‌ శర్మ భార్య ఆగ్రహం

మరిన్ని వార్తలు