'ఈ అవార్డు నా చిట్టితల్లికి అంకితం'

4 May, 2021 17:13 IST|Sakshi

హరారే: పాకిస్తాన్‌ జట్టు ప్రస్తుతం జింబాబే దేశంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో చేజెక్కించుకున్న పాక్‌ రెండు టెస్టుల సిరీస్‌లోనూ ఆధిపత్యం చెలాయిస్తుంది. జింబాబ్వేతో జరిగిన మొదటి టెస్టులో ఇన్నింగ్స్‌ 116 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో పాకిస్తాన్‌ బౌలర్‌ హసన్‌ అలీ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన హసన్‌ అలీ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి దుమ్మురేపాడు. ఓవరాల్‌గా 9 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్‌ విజయం అనంతరం పాక్‌ క్రికెటర్‌ హసన్‌ అలీకి 2019లో వివాహమైంది. 'గత ఏప్రిల్‌ నెలలో హసన్‌ అలీకి కూతురు పుట్టింది. కూతురు రాక అతని అదృష్టం కలిసొచ్చిందంటూ' ఒక జర్నలిస్ట్‌ ట్విటర్‌లో కామెంట్‌ చేశాడు.

దీనిపై హసన్‌ అలీ రీట్వీట్‌ చేశాడు. '' నా కూతురు పుట్టినప్పటి నుంచి నా ప్రదర్శన చాలా మెరుగైంది. నా కూతురే దేవుడి రూపంలో నా వెంట ఉంటూ నాకు ఆశీర్వాదం అందించింది. అందుకే ఈరోజు మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాను. అందుకే నాకు వచ్చిన ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డును నా చిట్టితల్లికి అంకితమిస్తున్నా. నా కూతురును చాలా మిస్సవుతున్నా.. కానీ బందుత్వం కంటే దేశానికి ఆడాలనేది నా మొదటి ప్రాధాన్యత.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక హసన్‌ అలీ పాక్‌ తరపున 12 టెస్టుల్లో 52, 54 వన్డేల్లో 83, 36 టీ20ల్లో 48 వికెట్లు తీసుకున్నాడు. ఇక జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టు విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 176 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌట్‌ కాగా.. పాక్‌ బ్యాటింగ్‌లో పవాద్‌ ఆలమ్‌ 140 పరుగులతో రాణించాడు. అనంతరం ఫాలోఆన్‌ ఆడిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌట్‌ అయి ఇన్నింగ్స్‌ 116 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా రెండో టెస్టు మే 7 నుంచి 11 వరకు జరగనుంది.
చదవండి: మరణించిన క్రికెటర్‌కు ‘హ్యాపీ బర్త్‌డే‘ చెప్పిన బోర్డు!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు